భోపాల్‌లో అదృశ్యం! బెంగళూరులో ప్రత్యక్షం!

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు భోపాల్‌లో అకస్మాత్తుగా అదృశ్యమై, బెంగుళూరులో ప్రత్యక్షమయ్యారు. వీరంతా తిరుగుబాటు చేసినట్లుగా భావిస్తున్నా రు. పైగా వీళ్లంతా జ్యోతిరాదిత్య సింధియా వర్గమని, ఈ సంక్షోభానికి కారణం అతనేనని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ వర్గీయులు ఆరోపణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ, కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నట్టుండి సంకటంలో పడిపోయింది. గతవారం పదిమంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో మొదలైన ఈ వ్యవహారం సోమవారం నాటికి మరో కీలక మలుపు తిరిగింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా వర్గంలోని 17 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు 6 మంది కేబినెట్‌ మంత్రులు ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. అయితే వీరం తా ప్రత్యేక విమానంలో బెంగళూరులో ప్రత్యక్షమైనట్టు తెలుస్తోంది. వీరందరూ సింధియా అండతో రెబెల్‌ ఎమ్మెల్యేలుగా మారి కమల్‌నాథ్‌ సర్కారు కు సవాల్‌ విసురుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. అయితే కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సింధియాతో కలిసి బిజెపి కుట్రపన్నిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు జరుగుతున్నా సింధియా ఢిల్లీలోనే ఉండిపోయారు. బిజెపి నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సంక్షోభానికి సింధియానే కారణమని కాంగ్రెస్‌లోని ఓ వర్గం అనుమానిస్తోంది. మరోవైపు కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి అసెంబ్లీలో సరపడ బలం లే దని బిజెపి వాదిస్తోంది. ప్రభుత్వంపై చాలామంది సభ్యులు అసంతృప్తితో ఉన్నారని చెబుతోంది. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుని అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని బీజేపీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌తో పాటు ఇతర సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. సింధియా వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో బిజెపి అనుసరించిన వ్యూహాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తునట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?