భూముల విలువ జంప్‌

పెరిగిన రిజిస్ట్రేషన్‌ చార్జీలు
వ్యవసాయ భూమి ఎకరానికి కనీస ధర రూ.75వేలు
ఓపెన్‌ ప్లాట్‌ కనీసం ధర గజానికి రూ.200
అపార్ట్‌మెంట్‌లో చదరపు అడుగు రూ.1000
మొత్తంగా 20 నుండి 50 శాతం పెరుగుదల

ప్రజాపక్షం / హైదరాబాద్‌ భూములు, ఆస్తుల మార్కెట్‌ విలువ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. వ్యవసా య భూములు, ప్లాట్ల మార్కెట్‌ విలువను 30 నుండి 50 శాతం వరకు, అపార్ట్‌మెంట్‌లలో ఫ్లాట్‌ల ధరలను 20 నుండి 30 శాతం వరకు పెంచారు. అలాగే రిజిస్ట్రేషన్‌ చార్జీలు 6 శాతం నుండి 7.5 శాతానికి పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తం గా పెరిగిన చార్జీలు గురువారం నుండి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా తక్షణమే ఏర్పాట్లు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ కమిషనర్‌, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కు ఆదేశాలిచ్చారు. సవరించిన చార్జీలకు సంబంధించిన జిఒ 58ని రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ శాఖ విడుదల చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2013లో ఈ ధరలను సవరించారు. తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ళకు తొలిసారిగా భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెం చా రు. 2021 వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదన సందర్భంగా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా రూ. 12,500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది క్రితం ఏడాది పెట్టుకున్న రూ.6వేల కోట్ల ప్రతిపాదన కంటే రెండింతలు. ఈసారి నిర్దేశించుకు న్న అంచనాలను అందుకునేందుకు భూముల మార్కెట్‌ విలువ, రిజిస్ట్రేషన్‌చార్జీలను పెంచారు.
మూడు రకాలుగా పెంపు వ్యవసాయ, వ్యవసాయేతర(ప్లాట్లు, ఆస్తుల) భూముల విలువను మూడు రకాలుగా పెంచా రు. ప్రస్తుత మార్కెట్‌ ధరల ఆధారంగా తక్కువ స్థాయి, మధ్య స్థాయి, ఎక్కువ స్థాయిగా విభజించారు. వ్యవసాయ భూములకు కనీస ధర ఎకరానికి రూ.75 వేలుగా నిర్ధారించారు. అలాగే ఎక్కువ ధర ఉన్న భూముల విలువ 30 శాతం, మధ్య స్థాయి ధర ఉన్న భూముల విలువ 40 శాతం, తక్కువ ధర ఉన్న భూముల విలువ 50 శాతం వరకు పెంచారు. ఇక ఓపెన్‌ ప్లాట్ల విషయానికి వస్తే చదరపు గజం కనీస ధరను రెట్టింపు చేశారు. ప్రస్తుతం ఉన్న కనిష్ఠ ధరను రూ.100 నుండి రూ. 200లకు పెంచగా, ఎక్కువ ధర కలిగిన ప్లాట్లకు 30 శాతం, మధ్యస్థ ప్లాట్లకు 40 శాతం, కనిష్ఠ స్థాయి ప్లాట్లకు 50 శాతం వరకు మార్కెట్‌ విలువను పెంచారు. అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ విషయంలో కనీస ధరను చదరపు అడుగుకు ప్రస్తుతం ఉన్న రూ.800 లను రూ.1000 లకు పెంచారు. కనిష్ఠ స్థాయి అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ ధరను 30 శాతం, గరిష్ఠ స్థాయి ధర ఉన్న ఫ్లాట్‌కు 20 శాతం వరకు ధరలను పెంచారు. రిజిస్ట్రేషన్‌ స్టాంప్‌ డ్యూటీ రేటును 6 శాతం నుండి 7.5 శాతానికి పెంచారు. పెంచిన తరువాత కూడా దేశంలో మన దగ్గరే రిజిస్ట్రేషన్‌ చార్జీలు తక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో 11 శాతం, కేరళలో 10 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 7.5 శాతం వసూలు చేస్తున్నారని అంటున్నారు.
ముందే బుక్‌ చేసుకున్నా అదనంగా కట్టాల్సిందే
పెరిగిన భూముల మార్కెట్‌ విలువ, రిజిస్ట్రేషన్‌ స్టాంప్‌ డ్యూటీ చార్జీలు ఈ నెల 22వ తేదీ(గురువారం) నుండి అమల్లోకి రానున్నాయి. అయితే, ఇప్పటికే 22వ తేదీ, ఆ తరువాత తేదీలలో రిజిస్ట్రేషన్‌ కోసం అడ్వాన్స్‌గా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారు కూడా అదనంగా కొత్త చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం ధరణిలో ఇప్పటికే స్లాట్‌ బుక్‌ అయినవారికి అదనపు చార్జీల చెల్లింపు పేరుతో ప్రత్యేక మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. వినియోగదారులకు వివరణ కోసం 18005994788 నెంబర్‌తో ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ను, అలాగే ascmro@telangana.gov.in ఈ మెయిల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?