భూమి గతితప్పుతోంది!

శతాబ్ద కాలంలో 10 మీటర్లు పక్కకు ఒరిగిన మన గ్రహం

మీకు తెలుసా? మన భూమి చలిస్తోంది, వణికిపోతున్నది, ఇటు అటు ఊగిసలాడుతోంది, స్థిరనిశ్చయం లేకుండా కదులుతోంది. కేవలం గడిచిన ఒక్క శతాబ్దంలోనే భూమి 10 మీటర్లకు పైగా పక్కకు ఒరిగిందంటే ఆశ్చర్యంగా వుంది. దీనికంతటికీ కారణం మానవులేనని ఎప్పటికైనా నిందమోయాల్సిందే. భూమి స్థిరనిశ్చయం లేకుండా కదలడమంటే అది సమతుల్యత లోపించి భ్రమించడమే. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల మాదిరిగానే భూమి కూడా తిరుగుతూ వుంటుంది. అయితే భూమి తన కక్ష్యలో తనకు తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. ఇదొక కాలచక్రం. అయితే కక్ష్యలో ఏ మాత్రం గతి తప్పకుండా తిరగడమే దాని ప్రత్యేకత. కానీ ఈ మధ్య భూగ్రహం భ్రమణంలో మార్పు కన్పిస్తున్నదని నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీ (కాలిఫోర్నియా) శాస్త్రవేత్తలు వెల్లడించాలు. ధృవాల వద్ద ఉన్న మంచు కరిగిపోతుండటం దీనికి ప్రధాన కారణమని వారంటున్నారు. నిజానికి భూమి గతి తప్పడానికి మూడు కారణాలున్నాయని వారు గుర్తించారు. భూభ్రమణం, భూపరిభ్రమణం ఒకేలా వుండటానికి కారణం భూమి పుట్టినప్పటి నుంచి దానిపై ఉన్న భౌగోళిక, నైసర్గిక స్వరూపాలన్నీ ఒకేలా వుండటమే. భూమిపై వున్న భౌగోళిక, నైసర్గిక స్వరూపాల్లో మార్పు వచ్చే కొద్దీ ఏదో ఒకవైపు బరువు తగ్గినా, పెరిగినా, ఇతర పరిస్థితులు కారణమైనా భూభ్రమణం, భూపరిభ్రమణంలో తేడా వస్తుంది. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. పూర్తిగా మంచుతో కప్పబడిన ధృవప్రాంతాల్లో మంచు కరిగిపోతూ వుంటే, భూ ఉపరితలంపై సహజంగానే సమతుల్యత దెబ్బతింటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. 21,000 సంవత్సరాల క్రితం నాటి మంచుయుగం నుంచి వందేళ్ల క్రితం వరకు భూమి దశదిశ బాగానే వున్నప్పటికీ, గడిచిన వందేళ్ల కాలంలో అంటే శతాబ్దం కాలంలో భూమి చలించిపోతుందంటే, అందుకు మనిషే ప్రధాన కారణమని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. గ్రీన్‌ల్యాండ్‌లో మంచు కరిగిపోవడం వల్ల భూ కదలికలో దాదాపు 33 శాతం ప్రభావం కలిగినట్లు భావిస్తున్నారు. 20వ శతాబ్దంలో గ్రీన్‌ల్యాండ్‌పై వున్న మంచు భారీగా అంటే 7,500 గిగాటన్నులు కరిగిపోయినట్లు నాసా అంచనా వేసింది.

DO YOU LIKE THIS ARTICLE?