భారత మహిళలకు చుక్కెదురు

మంధనా రికార్డు హాఫ్‌ సెంచరీ వృథా
తొలి టి20లో కవీస్‌ విజయం
వెల్లింగ్టన్‌: భారత మహిళల, న్యూజిలాండ్‌ మహిళల జట్ల మధ్య ప్రారంభమైన టి20 సిరీస్‌లో కివీస్‌ జట్టు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి టి20లో కివీస్‌ జట్టు 23 పరుగులతో భారత్‌పై విజయం సాధించింది. బౌలింగ్‌లో రాణించిన టీమిండియా మరోసారి బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. సునాయాసమైన 160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మరోసారి తడబడింది. ప్రియ పూణియా (4) పరుగులకే పెవిలియన్‌ చేరినా తర్వాత ఫస్ట్‌ డౌన్‌ జెమీమ రొడ్రిగ్స్‌ (39; 33 బంతుల్లో 6 ఫోర్లు)తో కలిసి ఓపెనర్‌ స్మృతి మంధనా (58; 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు, మెరుపు ఆరంభాన్ని అందించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 98 పరుగులు జోడించినా తర్వాతి బ్యాట్స్‌వుమెన్స్‌లు మిగిలిన స్వల్ప లక్ష్యాన్ని పూర్తి చేయలేక పోయారు. 34 పరుగుల వ్యవధిలోనే టీమిండియా చివరి 9 వికెట్లు కోల్పోవడం వారి చెత్త బ్యాటింగ్‌కు నిదర్శనం. 51 బంతుల్లో 58 పరుగులు చేయాల్సిస సమయంలో కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్న మంధనా పెవిలియన్‌ చేరింది. చేతిలో 8 వికెట్లు ఉన్నా కానీ తార్వతి బ్యాటర్లు ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించకపోవడం గమనార్హం. తర్వాత వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. పోటీపడి మరి తమ వికెట్లను సమర్పించుకున్నారు. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (15 బంతుల్లో 17) పరుగులు మినహా మిగతా వారు రెండంకెల స్కోరును కూడా దాటలేక పోయారు. దీంతో భారత్‌ 19.1 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైపోయింది. కివీస్‌ బౌలర్లలో లీ తాహుహు మూడు వికెట్లతో చెలరేగింది. ఇతర బౌలర్లలో కాస్పరేక్‌ , ఆమీల కేర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ మహిళా జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కివీస్‌ జట్టులో ఓపెనర్‌ సూజి బెట్స్‌ (7) విఫలమైనా మరో ఓపెనర్‌ సోఫీ డెవీన్‌ (62; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన అర్ధ శతకంతో చెలరేగింది. ఇతర బ్యాట్స్‌వుమెన్స్‌లో కెప్టెన్‌ ఆమీ సాటర్‌వైట్‌ (27 బంతుల్లో 33), కాటే మార్టిన్‌ ((27; 14 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), కైట్లిన్‌ గురే (15) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అరుందతీ రెడ్డి, రాధ యాదవ్‌, దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు. పొదుపుగా బౌలింగ్‌ చేసిన దీప్తి శర్మ 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక వికెట్‌ తీసింది. కివీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్‌ తాహుహుకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇక భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో టి20 8న జరగనుంది.
మంధనా ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ..
ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధనా రికార్డు హాఫ్‌ సెంచరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన 22 ఏళ్ల యువ క్రీడాకారిణి మంధనా 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ శతకం బాదేసింది. దీంతో భారత్‌ తరఫున వేగవంతమైన హాఫ్‌ సెంచరీ సాధించిన తొలి క్రీడాకారిణిగా కొత్త రికార్డు సృష్టించింది. ఇంతకుముందు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ పేరుతో ఉన్న రికార్డును తాజాగా మంధనా అధిగమించింది. 2018లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 29లో అర్ధ శతకం సాధించింది. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ టి20ల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ సాధించినా మహిళా క్రికెటర్ల జాబితాలో న్యూజిలాండ్‌ స్టార్‌ సోఫీ డెవీన్‌ మొదటి స్థానంలో ఉంది. 2005లో బెంగళూరు వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సోఫీ (న్యూజిలాండ్‌) 18 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసి కొత్త రికార్డు సృష్టించింది.
మిథాలీకి మరోసారి..
భారత స్టార్‌ బ్యాట్స్‌వుమన్‌, సీనియర్‌ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌కు మరోసారి టి20ల్లో చేదు అనుభవం ఎదురైంది. గత ఏడాది మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో మంచి ఫామ్‌లో ఉన్న మిథాలీ రాజ్‌ను తప్పించడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఆ సమయంలో భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, కోచ్‌ రమేశ్‌ పొవార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవలే మిథాలీ సారథ్యంలో టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి స్టార్‌ క్రీడాకారిణిని తాజా టి20 సిరీస్‌లో మరోసారి తప్పించి భారత్‌ తగిన మూల్యం చెల్లించింది. అప్పుడు ప్రపంచకప్‌ను చేజార్చుకున్న హర్మన్‌ సేన ఇప్పుడు తొలి టి20లో ఘోర ఓటమి చవిచూసింది. బ్యాట్స్‌వుమెన్స్‌ తడబడంతో భారత్‌ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను సైతం కోల్పోయింది. ఆఖరి 8 వికెట్లు కేవలం 32 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఈ సమయంలో సీనియర్‌ బ్యాట్స్‌వుమన్‌ మిథాలీ ఉంటే ఫలితం మరొలా ఉండేది. ఇక హర్మన్‌ ప్రీత్‌ కావాలనే మిథాలీని తప్పిస్తున్నదా అనే సందేహం కలుగుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?