భారత్‌ ఘన విజయం

మంధనా మెరుపు శతకం
రాణించిన జెమీమా, ఎక్తాబిష్త్‌, పూనమ్‌
తొలి వన్డేలో 9 వికెట్లతో కివీస్‌ చిత్తు
ఐసిసి మహిళల చాంపియన్‌షిప్‌
నేపియర్‌: కోహ్లీ సేనను అనుసరిస్తూ మిథాలీ సేన కూడా తొలి వన్డేలో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఒక రోజు వ్యవధిలోనే భారత పురుషుల, మహిళల జట్లు ఘన విజయాలు సాధించి కివీస్‌ పర్యటనను శుభారంభం చేశాయి. ఐసిసి మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత మహిళా జట్టు 9 వికెట్లతో కివీస్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ జట్టు భారత బౌలర్లు ఏక్తా బిష్త్‌ (3/32), పూనమ్‌ యాదవ్‌ (3/42) ధాటికి 192 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత జట్టులో ఓపెనర్లు స్మృతి మింధనా (105), జెమీమా రొడ్రిగ్స్‌ (81 నాటౌట్‌) రాణించడంతో టీమిండియా 33 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్‌ కోల్పోయి193 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1 ఆధిక్యంలో నిలిచింది. శతకంతో చెలరేగిన మంధనాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. 22 ఏళ్ల మంధనా ఇటీవలే ఐసిసి మహిళా క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును కూడా గెలుచుకుంది.
చెలరేగిన మంధనా, జెమీమా..
కివీస్‌ నిర్ధేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధనా, జెమీమా రొడ్రిగ్స్‌ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కివీస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. జెమీమా కుదురుగా ఆడుతుంటే మంధనా మాత్రం చెలరేగి ఆడింది. ఈ క్రమంలోనే వీరు తొలి వికెట్‌కు 52 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నారు. అనంతంరం బౌండరీల వర్షం కురుపిస్తూ దూకుడుగా ఆడుతున్న మంధనా 43 బంతుల్లోనే 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ జంటను విడదీయడానికి ప్రత్యర్థి బౌలర్లు ఎంతగానో ప్రయత్నించారు. కానీ, వారికి ఫలితం దక్కలేదు. వీరిద్దరూ ఒకవైపు జాగ్రత్తగా ఆడుతూ వికెట్లు కాపాడుకుంటూనే.. మరోవైపు వేగంగా పరుగులు సాధిస్తూ భారత్‌ను ముందుకు సాగించారు. డ్రింక్స్‌ బ్రేక్‌ సమయానికి 16 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 96 పరుగులు చేసిన భారత్‌ తర్వాత 17.3 ఓవర్లలో 100 పరుగుల మార్కును దాటింది. మరోవైపు సమన్వయంతో ఆడుతూ మంధనాకు అండగానిలిచిన జెమీమా కూడా 61 బంతుల్లో 6 ఫోర్ల సహకారంతో అర్ధ శతకం సాధించింది. ఈ జంటను విడదీయడానికి కివీస్‌ కెప్టెన్‌ ఎంతగానో శ్రమించాడు. తరచు బౌలర్లను మార్చుతూ బౌలింగ్‌ చేయించినా ఫలితం లేకుండా పోయింది. వీరిద్దరూ తమదైన శైలిలో చెలరేగి ఆడడంతో భారత జట్టు లక్ష్యంవైపు ఒకొక్క మెట్టు వేస్తూ ముందుకు సాగిపోయింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ తొలి వికెట్‌కు 166 బంతుల్లో అజేయంగా150 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకొని టీమిండియాను పటిష్ట స్థితిలో చేర్చారు. తద్వార భారత్‌ విజయం దాదాపు ఖాయమయింది. ఇక దూకుడుగా ఆడుతున్న స్మృతి మంధనా 101 బంతుల్లోనే 8 ఫోర్లు 3 భారీ సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకుంది. దీంతో మంధనా వన్డేల్లో తన నాలుగో శతకాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు జెమీమా కూడా ధాటిగా ఆడడంతో భారత్‌ సునాయాసంగా లక్ష్యంకు చేరువైంది. చివర్లో దూకుడుగా ఆడుతున్న స్మృతి మంధనా (105) పరుగుల వద్ద అమెలియా కేర్‌ బౌలింగ్‌లో ఔటవ్వడంతో భారత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 190 పరుగులు జోడించారు. తర్వాత జెమీమా అజేయంగా (94 బంతుల్లో 9 ఫోర్లతో 81) పరుగులు చేసి టీమిండియాను విజయ తీరానికి చేర్చింది. భారత్‌ 33 ఓవర్లలోనే 193/1 స్కోరు చేసి 9 వికెట్లతో ఘన విజయాన్ని అందుకుంది. అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు సూజి బెట్స్‌, సోఫీ డివైన్‌ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. అనంతరం కుదురుగా ఆడుతున్న సోఫీ డివైన్‌ 38 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 28 పరుగులు చేసి రన్నౌట్‌గా వెనుదిరిగింది.
పూనమ్‌ మాయా..
ఈ సమయంలో బౌలింగ్‌కు వచ్చిన స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ తన స్పిన్‌ మాయాజాలంతో కివీస్‌ బ్యాట్స్‌వుమెన్స్‌ను హడలెత్తించింది. పూనమ్‌ ధాటికి అప్పుడే క్రీజులో అడుగుపెట్టిన లౌరెన్‌ డ్వాన్‌ (0) ఖాతా తెరువకుండానే పెవిలియన్‌ చేరింది. అనంతంరం కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్న ఓపెనర్‌ సూజి బెట్స్‌ (36; 54 బంతుల్లో 2 ఫోర్లు)ను దీప్తీ శర్మ తెలివైన బంతితో ఔట్‌ చేసి కివీస్‌కు పెద్ద షాకిచ్చింది. దీంతో న్యూజిలాండ్‌ 16.2 ఓవర్లలో 70 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. 10 పరుగుల వ్యవధిలోనే కివీస్‌ మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్‌ అమీ సాటెర్‌వైట్‌, అమెలియా కేర్‌ నాలుగో వికెట్‌ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి కివీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కుదురుగా ఆడుతూ తమ వికెట్లను కాపాడుకున్నారు. ఈ క్రమంలోనే కివీస్‌ 27.1 ఓవర్లలో 100 పరుగుల మార్కును పూర్తి చేసుకుంది. తర్వాత పుంజుకున్న పూనమ్‌ యాదవ్‌ మరోసారి కివీస్‌ బ్యాట్స్‌వుమెన్స్‌పై విరుచుకుపడింది. అద్భుతమైన బంతులతో దూకుడుగా ఆడుతున్న న్యూజిలాండ్‌ సారథి సాటెర్‌వైట్‌ (45 బంతుల్లో 31)ను ఔట్‌ చేసి కివీస్‌ పతనాన్ని మొదలుపెట్టింది. దీంతో 49 పరుగుల కీలకమైన నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత 17 పరుగుల వ్యవధిలోనే మరో సెట్‌ బ్యాట్స్‌ఉమన్‌ అమెలా కేర్‌ (28)ను కూడా పూనమ్‌ పెవిలియన్‌కి పంపి కివీస్‌కు పెద్ద షాకిచ్చింది.
విజృంభించిన ఏక్తా బిష్త్‌..
తర్వాత భారత సీనియర్‌ బౌలర్‌ ఏక్తా బిష్త్‌ కూడా విజృంభించి బౌలింగ్‌ చేసింది. వరుసక్రమంలో వికెట్లు తీస్తూ కివీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఎక్తా ధాటికి మాడి గ్రీన్‌ (10), కాస్పరెక్‌ (6), హన్నా రోవ్‌ (25) పెవిలియన్‌ చేరారు. మరోవైపు వికెట్‌ కీపర్‌ బెర్నడైన్‌ (9)ను దీప్తి శర్మ, హోలి హుడెల్‌స్టన్‌ (10)ను శిఖ పాండే ఔట్‌ చేశారు. దీంతో న్యూజిలాండ్‌ 48.4 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైపోయింది. భారత బౌలర్లలో ఏక్తా బిష్త్‌, పూనమ్‌ యాదవ్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ రెండు వికెట్లు దక్కించుకుంది. శిఖా పాండే ఒక వికెట్‌ పడగొట్టింది. ఇక భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే మ్యాచ్‌ జనవరి 29న మౌంట్‌ మౌంగనుయ్‌లో జరగనుంది.

DO YOU LIKE THIS ARTICLE?