భారత్‌-ఎ, లయన్స్‌ మ్యాచ్‌ డ్రా

అనధికారిక తొలి టెస్టు
వయనద్‌: భారత్‌ ఇంగ్లాండ్‌ లయన్స్‌ మధ్య జరిగిన అనధికారిక తొలి టెస్టు మ్యాచ్‌ డ్రా అయింది. రెండు జట్లు బ్యాటింగ్‌లో సత్తా చాటడంతో మ్యాచ్‌ ఫలితం తేలకుండా డ్రా అయింది. ఓలీ పొప్‌ (63; 122 బంతుల్లో 10 ఫోర్లు), సామ్‌ హైన్‌ (57) హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో ఆదివారం చివరి రోజు ఆట ముగిసే సమయానికి లయన్స్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఆదివారం 20/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన లయన్స్‌ జట్టులో ఓపెనర్లు తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. అనంతరం ఓపెనర్లు హోల్డెన్‌ (29), డక్కెట్‌ (30) పరుగులు చేసి ఔటయ్యారు. తర్వాత, ఓలీ పొప్‌, సామ్‌ హైన్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో లయన్స్‌ను ఆదుకున్నారు. వీరు మూడో వికెట్‌కు కీలకమైన 105 పరుగులు జోడించారు. భారత్‌ బౌలర్లలో జలజ్‌ సక్సేన, నదీమ్‌ చెరో రెండు వికెట్లు తీశారు. మరోబౌలర్‌ ఆవేష్‌ ఖాన్‌కు ఒక వికెట్‌ దక్కింది. అంతకుముందు ఇంగ్లాండ్‌ లయన్స్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 340 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ప్రియాంక్‌ పాంచాల్‌ (206), కెఎస్‌. భరత్‌ (142), కెఎల్‌ రాహుల్‌ (89) పరుగులతో రాణించారు. దీంతో భారత్‌ 540/6 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. భారత జట్టుకు 200 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

DO YOU LIKE THIS ARTICLE?