భారత్‌లో తాజాగా 9987 కరోనా కేసులు నమోదు

331 మంది మృతి
7466కి చేరిన కరోనా మృతుల సంఖ్య
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. గతవారం రోజులుగా దేశంలో గత వారం రోజులుగా 9 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే అత్యధికంగా 9987 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్‌ ప్రవేశించిన అనంతరం ఒకేరోజు అత్యధిక కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో కొవిడ్‌ మహమ్మారికి బలవుతున్న వారి సంఖ్య కూడా ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. తాజాగా ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 331 మంది మృత్యువాతపడ్డారు. ఒకేరోజు ఈ స్థాయిలో మరణాలు సంభవించడం కూడా ఇదే తొలిసారి. మంగళవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 2,66,598కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 7466మంది మృత్యువాతపడ్డట్లు పేర్కొంది. మొత్తం బాధితుల్లో 1,29,215 మంది కోలుకోగా మరో 1,29,917 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన అనంతరం దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా 67వేల పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతోపాటు 1868 మంది మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక తీవ్రత కొనసాగుతున్న దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. మరణాల సంఖ్యలో మాత్రం 12వ స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ మరింత తీవ్రతరమౌతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.
కరోనాతో ముంబయి మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ మృతి
ముంబయి మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ శిరీశ్‌ దీక్షిత్‌ కరోనాతో కన్నుమూశారు. ముంబైలో ధారావితో పాటు అనేక ప్రాంతాల్లో కరోనా విజృంభించడంతో బిఎంసి అధికారులు పెద్ద ఎత్తున కట్టడి చేర్యలు చేపట్టారు. అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే శిరీశ్‌కు కరోనా సోకినట్లు తెలిసింది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 82,968కి కరోనా సోకింది. 37 వేల మంది కోలుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?