భారత్‌లో కరోనా కేసులు 2331.. మరణాలు 73

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని పీడిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రెండు వేలు మార్కు దాటింది. దేశవ్యాప్తంగా ఈ వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారం సాయంత్రం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2331కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సాయంత్రం 7 గంటలకు విడుదల చేసిన హెల్త్‌బులిటెన్‌లో వెల్లడించింది. వీరిలో 73మంది మరణించగా దాదాపు 2 వేలమంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 174మంది కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారని తెలిపింది. మహారాష్ట్రలో కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉంది. తాజాగా ఇక్కడ మృతుల సంఖ్య 19కు చేరగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 416గా ఉంది. గుజరాత్‌లో కొవిడ్‌-19 మృతుల సంఖ్య 7కు చేరింది. మధ్యప్రదేశ్‌లో వైరస్‌ తీవ్రత పెరిగింది. మరణాల సంఖ్య 8కి చేరగా 99పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లో 47కేసులు నమోదుకాగా ఐదుగురు మరణించారు. కర్ణాటకలో ముగ్గురు, పశ్చిమబెంగాల్‌లో ఏడుగురు మరణించారు. ఢిల్లీలో కొవిడ్‌-19 తీవ్రత కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 208కు చేరగా నలుగురు మరణించారు. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో కొవిడ్‌19 కారణంగా ఇద్దరు మరణించారు. కేరళలో కొవిడ్‌ తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటికే ఇక్కడ 286కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఇద్దరు మరణించారు. ఉత్తర్‌ప్రదేశలో లో 121 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. బిహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా, తమిళనాడులో ఒకరుచొప్పున మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా కరోనా చెలరేగుతోంది. ఇక్కడ కేసుల సంఖ్య 143కి పెరిగింది. కేరళలో 286 కేసులు నమోదైనప్పటికీ, మరణాల సంఖ్య పెరగకుండా చూడటంలో అక్కడి ప్రభుత్వం, వైద్యులు సఫలీకృతులయ్యారు. పైగా ఎక్కువ కేసులు నమోదు కావడానికి కేరళలో అవకాశం వున్నప్పటికీ, ప్రభుత్వ చర్యలు అద్భుతంగా వుండటం, ప్రజల సహకారం వుండటంతో అక్కడ కరోనాను అదుపు చేయగలిగారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో కొత్తగా 328 కేసులు నమోదయ్యాయని చెప్పారు. తబ్లిగి జమాత్‌ క్లస్టర్‌కు సంబంధించిన లింకు కేసులపై ఇంకా అన్వేషణ కొనసాగుతున్నదని చెప్పారు. 1.5 కోట్ల వ్యక్తిగత రక్షణ పరికరాలను ఇతర రాష్ట్రాలకు సరఫరాచేసినట్లు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?