భారత్‌కు ఆసీస్‌ షాక్‌

ధావన్‌, రోహిత్‌ శ్రమ వృథా
టర్నర్‌ విధ్వంసం.. రాణించిన హాండ్స్‌కాంబ్‌, ఖవాజా
టీమిండియాపై ఆసీస్‌ విజయం
సిరీస్‌ 2-2తో సమం
మొహాలి: పరుగుల సునామీలో చివరికి విజయం ఆస్ట్రేలియాకే వరించింది. భారత్‌ మధ్య ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్‌ 4 వికెట్లతో విజయాన్ని అందుకుంది. కోహ్లీ సేన నిర్దేశించిన 359 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ మరో 13 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విధ్వంసకర బ్యాటింగ్‌ చేసిన ఆష్టన్‌ టర్నర్‌ (84నాటౌట్‌; 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మరోవైపు పీటర్‌ హాండ్స్‌కాంబ్‌ (117), ఉస్మాన్‌ ఖవాజా (91)లు మూడో వికెట్‌కు 192 పరుగులు జోడించి ఆసీస్‌ను ఆదుకున్నారు. చివర్లో అలెక్స్‌ క్యారీ (21)తో కలిసి టర్నర్‌ ఆసీస్‌ విజయాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. భారత జట్టులో ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌( 143; 115బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ శతకం నమోదు చేయగా.. మరోవైపు రోహిత్‌ శర్మ(95; 92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 193 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. చివర్లో రిషభ్‌ పంత్‌ (36), విజయ్‌ శంకర్‌ (26) రాహుల్‌ (26) రాణించడంతో భారత్‌ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఇక భారత్‌ మధ్య ఆఖరి వన్డే బుధవారం ఢిల్లీ వేదికగా జరగనుంది.
ఆదిలోనే షాక్‌..
భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు భారత పేసర్లు ఆదిలోనే షాకిచ్చారు. ఓపెనర్‌ ఫించ్‌ (0), షాన్‌ మార్ష్‌ (6)లను బుమ్రా, భూవీలు పెవిలియన్‌ పంపారు. దీంతో ఆసీస్‌ 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
ఆదుకున్న ఖవాజా, హాండ్స్‌కాంబ్‌..
అనంతరం ఉస్మాన్‌ ఖవాజా, పీటర్‌ హాండ్‌కాంబ్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆసీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ పిచ్‌పై పాతుకుపోయారు. ధాటిగా ఆడుతూ పరుగుల వరత పారించారు. ఆఖరికి జట్టు స్కోరు 204 పరుగుల వద్ద బుమ్రా తెలివైన బంతితో ఈ ప్రమాధకరమైన జంటను విడదీశాడు. దీంతో ఖవాజా (91; 99 బంతుల్లో 7 ఫోర్లు) ఔటయ్యాడు. వీరు నాలుగో వికెట్‌కు 192 పరుగల భాగస్వామ్యం ఏర్పర్చి ఆసీస్‌కు పటిష్ట స్థితిలో ఉంచారు. తర్వాత వచ్చిన హిట్టర్‌ మ్యాక్స్‌వెల్‌ (13 బంతుల్లో 23) పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖర్లో శతకంతో జోరుమీదున్న హాండ్‌కాంబ్‌ (117; 105 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌లు)ను చాహల్‌ పెవిలియన్‌ పంపాడు. అనంతరం టర్నర్‌ (84; 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు), అలెక్స్‌ క్యారీ (21) అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆసీస్‌కు విజయతీరాలకు చేర్చారు. దీంతో ఆసీస్‌ మరో 13 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్‌, కుల్దీప్‌, చాహల్‌లకు తలో వికెట్‌ దక్కింది.
ఎట్టకేలకు శుభారంభం..
అంతకుముందు టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు రోహిత్‌ శ ర్మ, శిఖర్‌ ధావన్‌లు ఎట్టకేలకు శుభారంభాన్ని అందించారు. కొంత కాలంగా ఘోరంగా విఫలమవుతున్న ఈ జంట ఆఖరికి తమ పాత ఫామ్‌ను అందుకుంది. వీరిద్దరూ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సిరీస్‌లో పేలవం గా ఆడుతున్న ధావన్‌ చాలా కాలం తర్వాత తనపూర్వటి ఆటను ప్రదర్శించాడు. ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న ధావన్‌ నాలుగో వన్డే లో తన బ్యాట్‌ ఝుళిపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ధావన్‌ ఆసీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ వేగం గా స్కోరుబోర్డును ముందుకు పరిగెత్తించాడు. వే గంగా ఆడిన ధావన్‌ 44 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ సాధించాడు. మరోవైపు రోహిత్‌ కూడా దూకుడుగా ఆడుతూ ఇతనికి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలోనే వీరు తొలి వికెట్‌కు 104 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. తర్వాత రోహిత్‌ కూడా 61 బం తుల్లో శతకం నమోదు చేశాడు. అనంతరం వీరు మరింతగా జో రుపెంచడంతో ఆసీస్‌ బౌల ర్లు ప్రేక్షకపాత్ర పోషిస్తూ పరుగులను సమర్పించుకొంటూ పో యారు. ఆఖరికి 193 పరుగుల వద్ద ఈ జో డీని రిచర్డ్‌సన్‌ విడగొట్టా డు. దీంతో జోరుమీదున్న రోహిత్‌ శర్మ (95; 92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకానికి చేరువలో పెవిలియన్‌ చేరాడు. తర్వాత ధావన్‌ మరింత ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో ధావన్‌ 97 బంతుల్లో కెరీర్‌ 16వ వన్డే సెంచరీ సాధించాడు.
విజృంభించిన కమిన్స్‌..
సెంచరీతో ఊపుమీదున్న ధావన్‌ బౌండరీల వరద పారించాడు. ఫోర్లు, సిక్స్‌లతో మైదానం నలుమూలల్లో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ సమయంలోనే ఆసీస్‌ ప్రధాన పేసర్‌ కమిన్స్‌ విజృంభించాడు. నిప్పులు చెరిగే బంతులతో భారత్‌ను కట్టడి చేయడం మొదలెట్టాడు. ముందు ఇతని ధాటికి భారత్‌ స్కోరు 254 పరుగుల వద్ద అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడుతున్న ధావన్‌ (143; 115 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఔటయ్యాడు. ఈ కీలక వికెట్‌ను తొలి వికెట్‌గా కమిన్స్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆపై మరో 12 పరుగుల వ్యవధిలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(7) కూడా ఔట్‌ కావడంతో భారత్‌ మూడో వికెట్‌ను చేజార్చుకుంది. ఆ తరుణంలో కెఎల్‌ రాహుల్‌తో కలిసి యువ సంచలనం రిషభ్‌ పంత్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. కానీ అప్పటికే పుంజుకున్న ఆసీస్‌ బౌటర్లు విజృంభించి బౌలింగ్‌ చేశారు. వీరి ధాటికి కుదురుగా ఆడుతున్న రాహుల్‌ (31 బంతుల్లో 26) నాలుగో వికెట్‌గా పెవిలియన్‌ బాటపట్టాడుకాసేపటికే చెలరేగి ఆడుతున్న రిషభ్‌ పంత్‌(36; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌) ఐదో వికెట్‌గా కమిన్స్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అటు తర్వాత కేదార్‌ జాదవ్‌(10), భువనేశ్వర్‌లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో భారత్‌ స్కోరులో వేగం తగ్గింది. చివర్లో విజయ్‌ శంకర్‌( 26; 15 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగులు భారీ స్కోరు చేసింది. కమిన్స్‌ వేసిన ఆఖరి ఓవర్‌ చివరి బంతికి బుమ్రా సిక్స్‌ కొట్టి ఆకట్టుకున్నాడు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ ఐదు వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్సన్‌ మూడు వికెట్లు తీశాడు. మరోవైపు ఆడమ్‌ జంపాకు ఒక వికెట్‌ దక్కింది.

DO YOU LIKE THIS ARTICLE?