భానుడి భగభగలు

ఉదయం 7గంటల నుంచే మండుతున్న ఎండలు
ఖమ్మంలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇటీవల వరకు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితులు ఉండేవి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం కొంత మేరకు వెసులుబాటు కల్పించింది. అయినప్పటికీ ఎండలు తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఒకవైపు వేడి, మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. మరో మూడు రోజుల పాటు రా ష్ట్రంలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలుచోట్ల సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరిగింది. మరికొన్ని రోజులు భానుడి ప్రతాపం తప్పదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?