బోర్డింగ్‌ పాస్‌లపై మోడీ బొమ్మలు!

సరిగా స్పందించని ఎయిర్‌ ఇండియా
ఎన్నికల సంఘం తీవ్ర అసంతృప్తి
ఖాదీ ఇండియానూ వాడుకుంటున్న మోడీ సర్కార్‌
న్యూఢిల్లీ : ఎయిర్‌ ఇండియా బోర్డింగ్‌ పాస్‌లపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ బొమ్మలు దర్శనమిస్తున్నాయి. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుంది. ఈ విషయంపై ఎన్నికల సంఘం శీఘ్రంగానే స్పందించి, ఎయిర్‌ ఇండియాకు షోకాజు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆ వైమానిక సంస్థ మాత్రం అసలు స్పందించలేదు. దీంతో ఎయిర్‌ ఇండియా వైఖరిపై ఎన్నికల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. షోకాజు నోటీసులకు సమాధానం ఇవ్వడానికి రెండు రోజుల ముందే గడువు ముగిసినప్పటికీ, ఎయిర్‌ ఇండియా ఇప్పటివరకు స్పందించలేదని ఎన్నికల సంఘం కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి పి.ఎస్‌. ఖరోలాకు రాసిన ఒక లేఖలో తన అసంతృప్తిని వ్యక్తంచేసింది. “ఎయిర్‌ ఇండియా లెఖ్కలేని తనంపై ఎన్నికల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. . ఓవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నది. మరోవైపు మేం గుర్తించి, షోకాజులు పంపించినా స్పందన లేదు. ఈ వైఖరి సరైనది కాదు” అని ఏప్రిల్‌ 2వ తేదీతో పంపిన లేఖలో ఇసి పేర్కొంది. తమ అసంతృప్తిని ఎయిర్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశ్వినీ లోహానికి కూడా తెలియజేయాలని కోరింది. ఎన్నికల ప్రచారం విషయంలో మోడీ సర్కారు ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తున్న విషయం తెల్సిందే. ఖాదీ ఇండియా బోర్డుపై కూడా మహాత్మాగాంధీ బొమ్మను తొలగించి, మోడీ బొమ్మను వాడుతున్న విషయం తెల్సిందే. దీనిపై సిపిఐతోపాటు వివిధ పార్టీలు తీవ్రంగా స్పందించా యి. అయినప్పటికీ, ఎన్నికల సంఘం పట్టించుకోలేదని ఆ పార్టీలు విమర్శించాయి.

DO YOU LIKE THIS ARTICLE?