బోణీ కొట్టిన సన్‌రైజర్స్‌

హైదరాబాద్‌: తమ సొంత గడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బోణీ కొట్టింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 5 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్‌లు పరుగుల వరద పారించారు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 198 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆర్‌ఆర్‌ జట్టులో యువ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌ (102; 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) విరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. మరోవైపు కెప్టెన్‌ అజింక్యా రహానే (70; 49 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడడంతో రాజస్థాన్‌.. హైదరాబాద్‌కు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ విధ్వంసకర ఆరంభాన్ని అందించాడు. తొలి మ్యాచ్‌లో చెలరేగి ఆడిన వార్నర్‌ రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కనబర్చాడు. ఒక ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తనలోని కసి ఇంకా తగ్గలేదని రుజువు చేశాడు. భారీ పరుగుల లక్ష్యఛేదనలో వార్నర్‌ మొదటి నుంచే రాయల్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ధాటిగా ఆడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. ఏ బౌలర్‌ను కూడా వదలకుండా అందరిని ఉతికి ఆరేశాడు. ఈక్రమంలోనే వార్నర్‌ 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇతని ధాటికి సన్‌రైజర్స్‌ 8.5 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును అందుకుంది. ఆఖరికి చెలరేగి ఆడుతున్న వార్నర్‌ (69; 37 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు స్కోరు 110 వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత బైరిస్టో (45; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), విజయ్‌ శంకర్‌ (35; 15 బంతుల్లో 1 ఫోర్‌; 3 సిక్స్‌లు) విజృంభించి ఆడారు. చివర్లో యూసుఫ్‌ పఠాన్‌ నా టౌట్‌), రషీద్‌ ఖాన్‌ (15 నాటౌట్‌ 8 బంతుల్లో 1సిక్స్‌, 1ఫోర్‌) ధాటిగా ఆడడంతో సన్‌రైజర్స్‌ మరో ఓవర్‌ మిగిలిఉండగానే 201/5 స్కోరు చేసి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఇదే మొదటి సారి. ఇంతకుముందు ఢిల్లీపై 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తాజా మ్యాచ్‌ ద్వారా అత్యధిక పరుగుల ఛేదనని సన్‌రైజర్స్‌ సవరించుకుంది. ఈ మ్యాచ్‌లో (1/24) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు.. బ్యాటింగ్‌లో ఒక సిక్స్‌, ఒక ఫోర్‌తో విజయాన్ని పూర్తి చేసిన యువ సంచలనం రషీద్‌ ఖాన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.
కోహ్లీ సేనతో పోరుకు రెడీ..
హోమ్‌ గ్రౌండ్స్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పుడు రెండో పోరుకు సిద్ధమయింది. ఆదివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో సన్‌రైజర్స్‌ ఢీ కొన నుంది. రాజస్థాన్‌ను ఓడించి జోరుమీదున్న హైదరాబాద్‌ కోహ్లీ సేనను కూడా ఓడించేందుకు రెడీ అయింది. మరోవైపు టోర్నీను ఘోరంగా ఆరంభించిన ఆర్‌సిబి తన రెండు మ్యాచుల్లోనూ ఓటమిని చవిచూసింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్‌పై గెలిచి బోణీ చేయాలని భావిస్తోంది. హైదరాబాద్‌, బెంగళూరు మధ్య మ్యాచ్‌ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి జరగనుంది.

DO YOU LIKE THIS ARTICLE?