బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన ప్రదర్శన

ప్రజాపక్షం / హైదరాబాద్‌: సింగరేణి పరిధిలోని 11 కొత్త బొగ్గు గనుల ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. హైదరాబాద్‌లోని నారాయణగూడ ఫ్లు ఓవర్‌ వద్ద గురువారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో చాడ వెంకటరెడ్డి, వి.ఎస్‌.బోస్‌, డాక్టర్‌ డి.సుధాకర్‌, ఇ.టి.నర్సింహా (సిపిఐ), ఎం. కోదండరామ్‌ (టిజెఎస్‌), డి.జె.నర్సింహా రావు, మహేందర్‌, రాములు (సిపిఐ(ఎం)), సంధ్య, అరుణ(న్యూడెమోక్రసీ), సాయిబాబా, బాల్‌రాజ్‌ (టిడిపి), రమాదేవి(సిపిఐ(ఎంఎల్‌ న్యూడెమోక్రసీ), ఎస్‌.ఎల్‌. పద్మ (ఐఎఫ్‌టియు), ఝాన్సీ (న్యూడెమోక్రసీ) తదితరులు పాల్గొన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి, సింగరేణి గనులను ప్రైవేటుకు ఇవ్వొద్దు, కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు నశించాలి అని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కాలరీస్‌లో రెండు రోజులుగా అన్ని కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయన్నారు. సింగరేణి పరిధిలో 11 బొగ్గు గనులను వేలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయొద్దని డిమాండ్‌ చేశారు. వాటిని ప్రైవేటుకిస్తే సింగరేణి నిర్వీర్యమవుతుందని, కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, అఖిలపక్షం ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున ఆందోళనకు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. కోదండరామ్‌ మాట్లాడుతూ సింగరేణి కాలరీస్‌ ఉత్తర తెలంగాణకు గుండెకాయలాంటిదన్నారు. వాటి కారణంగా ఎందరో అట్టడుగు వర్గాలకు ఉద్యోగాలు వచ్చాని, వారి స్థితిగతులు మారాయని, వారి పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థానాలకు వెళ్ళేలా చేశారన్నారు. మరోవైపు ప్రభుత్వానికి పన్నులు, శిస్తుల రూపంలో వేల కోట్లు సింగరేణి ద్వారా వస్తోందని, దీని వల్ల ప్రభుత్వాలకు లాభమే తప్ప ఎన్నడూ నష్టం జరగలేదని చెప్పారు. గనుల ప్రైవేటీకరణతో పర్యావరణ విధ్వం సం జరుగుతుందని, కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారతుందన్నారు. ఇప్పటికే రెగ్యులర్‌ ఉద్యోగులకంటే కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు తక్కువని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి ప్రైవేటీకరణను అనుమతించవద్దని కోరారు. డి.జి.నర్సింహారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 50 బొగ్గు గనులను కమర్షియల్‌ షేరింగ్‌ విధానంలో రూ.50వేల కోట్ల రుణాలిచ్చి మరీ ప్రైవేటు వ్యక్తుల కోసం వేలం వేస్తోందన్నారు. అందులో సింగరేణికి చెందిన 11 బొగ్గు గనులు ఉన్నాయన్నారు. కరోనా లాక్‌డౌన్‌లో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మేందుకు కేంద్రం సిద్ధమవడం సిగ్గు చేటు అని విమర్శించారు.

DO YOU LIKE THIS ARTICLE?