బెంగాల్‌పై 324

కోల్‌కతా హింసాత్మక ఘటనలపై ఇసి ఆగ్రహం
మొదటిసారిగా పశ్చిమబెంగాల్‌పై 324 అధికరణ ప్రయోగం
నేటి రాత్రితో ప్రచారం ముగించాలని ఆదేశం : ఒక రోజు ముందే మైకులు బంద్‌
బిజెపి, తృణమూల్‌ మాటల యుద్ధం

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఇసి) ఆగ్రహం వ్యక్తంచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం మొదటిసారి 324 అధికరణాన్ని ప్రయోగించింది. రాష్ట్రం లో గురువారం రాత్రి 10 గంటల నుంచే ఎన్నికల ప్రచారం ముగించాలని ఇసి ఆదేశించింది. చివరి దశ ఎన్నికలు మే 19న జరగనున్నాయి. చివరి దశ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లో ఇంకా 9 స్థానా ల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇసి నిర్ణయంతో ఈ తొమ్మిది నియోజక వర్గాల్లో గురువారంతో ఎన్నికల ప్రచారం ముగియనుం ది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం ముగించాల్సిన నియోజకవర్గాలు ఇవి: డమ్‌డమ్‌, బరాసత్‌, బసిర్హత్‌, జయ్‌నగర్‌, మథురాపుర్‌, డయమండ్‌ హార్బర్‌, జాదవ్‌పూర్‌, కోల్‌కతా దక్షిణ్‌, కోల్‌కతా ఉత్తర్‌. ‘324 అధికరణాన్ని ప్రయోగించడం బహుశా ఇదే మొదటిసారి. ఈశ్వరచంద్ర విద్యా సాగర్‌ విగ్రహం ధ్వంసం కావడం పట్ల ఇసి ఆవేదన వ్యక్తం చేస్తోంది. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారి ని రాష్ట్ర అధికారులు గుర్తించి, అదుపులోకి తీసుకుంటారని భావిస్తున్నాం’ అని ఎన్నికల అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ చంద్ర భూషణ్‌ కుమార్‌ హుటాహుటిన విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ఎన్నికల సంఘం రాజ్యాంగ అధికారాలను ఉపయోగించి మొదటిసారి ఇలాంటి చర్య తీసుకుందన్నారు. ప్రధాన కార్యదర్శి(హోం) అత్రి భట్టాచార్య, అదనపు డైరెక్టర్‌ జనరల్‌, సిఐడి, రాజీవ్‌ కుమార్‌ను పశ్చిమ బెంగాల్‌లో పోస్టింగ్‌ నుంచి తొలగించాలని కూడా ఎన్నికల సం ఘం ఉత్తర్వులు జారీచేసింది. బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా రోడ్‌ షో సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం మరునాడు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.

DO YOU LIKE THIS ARTICLE?