బిపిఎల్‌ కుటుంబాలకు రూ. 5 వేల సాయం

ప్రతిపక్షాల డిమాండ్‌
అకాల వర్షాలతో నష్టపోయిన పంటను మద్దతు ధరకే కొనుగోలు చేయాలి
వలస కార్మికులను అన్ని విధాలా ఆదుకుని, వారి స్వస్థలానికి పంపించాలి
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకుంటే గవర్నర్‌ను కలుస్తాం
అప్పటికే సమస్యలు పరిష్కారం కాకుంటే రోడ్డెక్కాల్సి వస్తుంది
రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన ప్రతిపక్షాల నేతలు

ప్రజాపక్షం/హైదరాబాద్‌: రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా దారిద్య్రరేఖకు దిగువన (బిపిఎల్‌) ఉన్న కుటుంబాలకు రూ.5 వేల ఆర్థిక సహాయం చేయాలని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. అకాల వర్షాలతో నష్టపోయిన పంటను కనీస మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వలస కార్మికుల ను అన్ని విధాలా ఆదుకుని, వారి స్వస్థలానికి పం పించాలని విజ్ఞప్తి చేశాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందిచకపోతే, ఈ విషయమై గవర్నర్‌ను కలుస్తామని, అప్పటికీ సమ స్య పరిష్కారం కాకపోతే ఇక రోడ్డెక్సాల్సి వస్తుందని విపక్ష పార్టీల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ మేరకు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌), చాడ వెంకట్‌రెడ్డి (సిపిఐ), ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ (టిజెఎస్‌), ఎల్‌.రమణ (టిడిపి), డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ (తెలంగాణ ఇంటి పార్టీ)లతో కూడిన అఖిలపక్ష ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని బిఆర్‌కె భవన్‌లోని తాత్కాలిక సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడి, రైతు సమస్యలు, పంటల కొనుగోలు తదితర అంశాలపై విపక్ష తదితర పలు అంశాలపై వారు సుమారు గంట సేపు చర్చించారు. పలు సమస్యలను, వాటి పరిష్కారానికి తగిన సూచన లు సలహాలను తెలియజేశారు. కరోనా సందర్భంగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చిన నిధులను వెంటనే ప్రకటించాలని, అలాగే ఇప్పటి వరకు కరోనా వైరస్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు ఖర్చు పెట్టిందో వెల్లడించాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. కరోనా సహాయాన్ని మరో రెండు నెలల పాటు కొనసాగించాలని, రేషన్‌కార్డులు దరఖాస్తు చేసుకున్న వారికి, అలాగే రేషన్‌ కార్డులు ఉన్నప్పటికీ సరుకులు తీసుకోలేదనే కారణంతో ప్రభుత్వ సహాయం పొందని వారికి కూడా 12 కిలోల బియ్యం, రూ. 15వందలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బియ్యంతో పాటు పప్పులు, నూనెను కూడా సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?