బిటిపిఎస్‌ అడ్డాగా ఇసుక అక్రమ రవాణా

కోట్లు దండుకుంటున్న అక్రమార్కులు
సీనరేజీ చెల్లించకుండా ఇసుకను తరలిస్తున్న కాంట్రాక్టర్‌

ప్రజాపక్షం/ ఖమ్మం : భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బిటిపిఎస్‌) కేంద్రంగా కోట్లాది రూపాయలను అక్రమ పద్ధతుల్లో ఆర్జిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా బిటిపిఎస్‌ నుండే జరుగుతుంది. బిటిపిఎస్‌కు చెందిన ఓ బడా కాంట్రాక్టర్‌ ప్రభుత్వానికి ఎటువంటి సీనరేజీ చెల్లించకుండానే వందల ట్రక్కుల ఇసుకను నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. అయినా పట్టించుకున్న నాథుడే లేడు. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో రాష్ట్ర ప్రభుత్వం 1080 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా థర్మల్‌ విద్యుత్తు కేంద్రం నిర్మిస్తున్న విషయం విదితమే. ఈ ప్లాంట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బిటిపిఎస్‌ నిర్మాణం పినపాక, మణుగూరు మండలాల మధ్య గోదావరి ఒడ్డున జరుగుతుంది. ఇది ఇసుక అక్రమార్కులకు అడ్డాగా మా రింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తరలింపునకు సంబంధించి తీసుకు వచ్చిన నిబంధనలు అక్రమార్కులకు ఇబ్బందిగా మారాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక రేవులను, గిరిజన సొసైటీలకు అప్పగించడంతోపాటు అడ్డగోలు తవ్వకాలపై నిషేధం విధించారు. ఈ క్రమంలో ఇసుక వ్యాపారం అతి పెద్ద వ్యాపారంగా మారడమే కాకుండా అక్రమార్కులకు కాసులు కురిపిస్తుంది. పెద్ద వ్యాపారులు కొందరు ఎంఎల్‌ఎ, ఎంపిల ప్రధాన అనుచరులు ఇప్పుడు వ్యాపారులుగా మారారు. అటువంటి వారికి ఇప్పుడు బిటిపిఎస్‌ అక్రమ వ్యాపారానికి స్వర్గధామంగా మారింది. బిటిపిఎస్‌ సమీపంలో అనుమతి పొందిన ఇసుకరేవులు లేవు. బిటిపిఎస్‌ నిర్మాణ స్థలంలో నుండి సాంబాయిగూడెం ఇసుక రేవు వరకు మూడు కిలో మీటర్ల మేర ఏకంగా రోడ్డు నిర్మించి అక్కడి నుండి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను బిటిపిఎస్‌కు తరలించి నిల్వలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి లారీల్లో, టిప్పర్లలో హైదరాబాద్‌ సహా అనేక ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. గత ఐదు నెలలుగా ఈ అక్రమ వ్యాపారం యధేచ్చగా కొనసాగుతుంది. అప్పుడప్పుడు బిటిపిఎస్‌ సెక్యూరిటీ సిబ్బంది ఇసుక లారీలను నిలిపినప్పటికీ బిటిపిఎస్‌ ప్రధాన అధికారుల ఆదేశాలతో లారీలను వదిలేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా మొత్తం ఇక్కడ ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?