బిజెపి ‘సైనిక రాజకీయం’పై వెటరన్స్‌ నిరసన

రాష్ట్రపతికి 50 మంది మాజీ సైనికాధికారుల అసాధారణ లేఖ

న్యూఢిల్లీ: ఇది అపూర్వం. స్వాతంత్య్ర తదుపరి గత 72 సంవత్సరాల్లో ఎన్నడూ జరగలేదు. ముగ్గురు మాజీ సైన్యాధిపతులు, నలుగురు మాజీ నౌకా దళాధిపతులు, ఒక మాజీ వైమానిక దళాధిపతి సహా 150 మందికిపైగా త్రివిధ దళాల రిటైర్డ్‌ అధికారులు రాష్ట్రపతికి ఒక సంయుక్త ఫిర్యాదు లేఖ రాశారు. సీమాంతర దాడుల వంటి మిలటరీ చర్యలకు ఖ్యాతిని పాలక పార్టీ అయిన బిజెపి తనకు ఆపాదించుకోవటమేగాక, సాయుధ బలగాలను “మోడీజీకి సేన” అనేంత వరకు వెళ్లటాన్ని వారు ఆక్షేపించారు.(రాష్ట్రపతికి అటువంటి లేఖ అందలేదని, ఆ లేఖపై సంతకందారులుగా చెప్పబడుతున్న వారిలో ముగ్గురు తాము సంతకం చేయలేదని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం నాడు చెప్పారు. అంటే సైన్యాన్ని రాజకీయ ప్రయోజనాలకు ప్రధాని సహా బిజెపి నాయకులు ఉపయోగించుకోవటాన్ని ఆమె సమర్థిస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది).
మాజీ సైన్యాధిపతి ఎస్‌.ఎఫ్‌.రోడ్రిగస్‌, మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎన్‌.సి.సూరి ఆ లేఖపై తాము సంతకం చేయలేదన్నారు. తనను చేర్చేముందు తన అనుమతి తీసుకోలేదని మాజీ ఉప సైన్యాధిపతి ఎం.ఎల్‌.నాయుడు చెప్పారు. మాజీ సైన్యాధిపతులు దీపక్‌ కపూర్‌, శంకర్‌ రాయ్‌ చౌధురి సహా అనేకమంది వెటరన్స్‌ ఆ లేఖను ధృవీకరించారు.
ఆ రిటైర్డ్‌ సైనికాధికారుల లేఖ ఇలా చెప్పింది
“మా సైనిక సహోదరులతోనూ, అలాగే అన్నిస్థాయిల్లో పనిచేస్తున్న సైనిక అధికారులతోను సంబంధం కొనసాగిస్తున్న వెటరన్స్‌ అయిన మేము ఆందోళన చెందుతున్నాము. భారత సైనిక దళాల సుప్రీం కమాండర్‌ అయిన మీకు, సర్వీసులో ఉన్న, రిటైర్‌ అయిన సైనికుల్లో తగినంత భయాందోళన, అసంతృప్తి కలుగజేస్తున్న కొన్ని సమస్యలను మీ దృష్టికి తెచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నాము”.
ఏప్రిల్‌ 11న బహిరంగమైన ఈ లేఖ, “రాజకీయ పార్టీలు మిలటరీ, మిలటరీ యూనిఫాంలు లేదా సింబల్స్‌ను, సైనిక దళాల లేక జవాన్‌ల ఏవైనా చర్యలను తమ రాజకీయ ప్రయోజనాలకు లేదా తన రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకునిపోయేందుకు ఉపయోగించుకోవటాన్ని మానుకోవాలని రాజకీయ పార్టీలను ఆదేశిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాల”ని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కోరింది. భారత సాయుధ దళాల రాజకీయరహిత, లౌకిక స్వభావం ప్రతి సైనికుడు, నావికుడు, వైమానికునికి నిష్ఠా గరిష్టతగా ఉందని వారు ప్రస్తావించారు. మిలటరీపై సివిల్‌ కంట్రోలు అనే ప్రజాస్వామిక సూత్రాన్ని సైనిక దళాలు విధేయతతో పాటిస్తున్నాయి. వాటి మిలటరీ వృత్తి నైపుణ్యం, భారతదేశ భౌగోళిక సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటంలో వాటి అంకితభావం విస్తృతంగా ప్రశంసలు పొందుతున్నది. సీమాంతర దాడుల వంటి సైనిక చర్యలకు ఖ్యాతిని తమకు ఆపాదించుకునే రాజకీయ నాయకుల తీరు, సాయుధ బలగాలను “మోడీజీకి సేన” అని చెప్పేంత దూరం వెళ్లటం అసాధారణం, ఏ మాత్రం ఆమోదనీయం కాదని లేఖ పేర్కొన్నది. పార్టీ కార్యకర్తలు ఎన్నికల వేదికలపై, ప్రచారంలో మిలటరీ యూనిఫాం ధరించటం, సైనికుల పోస్ట్‌లు, ఫోటోలను ముఖ్యంగా వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ చిత్రాలను ప్రదర్శించటానికి ఇది అదనం. ఈ దృశ్యాలను మీడియాలో చూస్తు న్నాం. కొందరు సీనియర్‌ రిటైర్డ్‌ అధికారులు, మాజీ నావికాదళాధిపతి సహా దీనిపై ఎన్నికల కమిషన్‌కు రాయగానే చర్య తీసుకోవటాన్ని వెటరన్స్‌ అభినందించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహా అటువంటి ప్రకటనలు చేసిన వారి నుంచి ఇసి సంజాయిషీ కోరింది. అయితే క్షేత్రస్థాయిలో ప్రవర్తన, ఆచరణలో అది ఎటువంటి చెప్పుకోదగ్గ మార్పు తేలేదని వారు విచారం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటం, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నమూనా ప్రవర్తనా నియమావళిని పూర్తిగా అలక్ష్యపెడుతున్న రాజకీయ వాతావరణంలో, “పోలింగ్‌ రోజు దగ్గర పడేకొలది అటువంటి ఘటనలు పెరుగుతాయని మేము భయపడుతున్నాం” అని లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగం కింద, రాష్ట్రపతి సుప్రీం కమాండ్‌ కింద వ్యవస్థీకృతమైన సాయు ధ బలగాలను ఈ విధంగా దురుపయోగం చేయటం వాటి మనోబలం, పోరాట పటిమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెటరన్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అది జాతీయ భద్రతను, జాతీయ సమగ్రతను నేరుగా దెబ్బతీస్తుంది. అందువల్ల మన సైనిక దళాల రాజకీయ రహిత, లౌకిక స్వభావాన్ని పరిరక్షించాలని వారు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఈ లేఖపై సంతకందారుల్లో మాజీ నౌకా దళాధిపతులు ఎల్‌.రాందాస్‌, అరుణ్‌ ప్రకాశ్‌, విష్ణు భగవత్‌ ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?