బాలికలదే హవా

పదో తరగతి ఫలితాల్లో 92.43 శాతం ఉత్తీర్ణత
బాలుర ఉత్తీర్ణత 91.18%, బాలికల ఉత్తీర్ణత 93.68%
జగిత్యాల జిల్లా ప్రథమం, హైదరాబాద్‌ అధమం
ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ కార్యదర్శి
జూన్‌ 10 నుండి 24వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఈ సారి కూడా బాలికలే సత్తా చాటారు. బాలుర కంటే కూడా ఉత్తీర్ణతలో ముందంజలో నిలిచారు. జిల్లా వారీ ఫలితాల్లో జగిత్యాల జిల్లా అగ్రగామిగా నిలవగా, రాజధాని హైదరాబాద్‌ చివరి స్థానంలో నిలిచింది. సచివాలయంలో సోమవారం నాడు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి పదవ తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి మొత్తం 92.43 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆయన వెల్లడించారు. మార్చిలో నిర్వహించిన పరీక్షల్లో 5,46,728 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. ఇందులో బాలుర ఉత్తీర్ణత 91.18 శాతం నమోదు కాగా, బాలికల ఉత్తీర్ణత 93.68 శాతంగా ఉందన్నారు. బాలుర కంటే కూడా బాలికలు 2.5 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారని జనార్దన్‌రెడ్డి తెలిపారు. జిల్లాల వారీగా టాప్‌ ర్యాంకులు నమోదు చేసుకున్న గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రం లో జగిత్యాల జిల్లా 99.73 శాతం ఉత్తీర్ణత సాధించి అన్ని జిల్లాల కంటే కూడా ప్రథమ స్థానంలో నిలువగా , రాజధాని హైదరాబాద్‌ మాత్రం చిట్ట చివరన అతి తక్కువగా 83.09 శాతం మార్కులు సాధించినట్లు జనార్దన్‌ రెడ్డి వెల్లడించారు. వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 4,374 ఉన్నాయని, అలాగే ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించకుండా సున్నా (జీరో) ఫలితాలు నమోదు చేసుకున్న పాఠశాలలు తొమ్మిది ఉన్నాయని తెలిపారు. తెలంగాణ బిసి సంక్షేమ గురుకుల పాఠశాలలు 98.78 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలువగా ప్రభుత్వ పాఠశాలలు 84.38 శాతంతో కొంత వెనుకబడి ఉన్నాయని జనార్దన్‌ రెడ్డి చెప్పారు. బిసి సంక్షేమంతో పాటు, కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయం (కెజిబివి), రెసిడెన్సియల్‌, మోడల్‌ స్కూల్స్‌, సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, ప్రైవేటు పాఠశాలల రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం కంటే కూడా కొంత ఎక్కువ ఉత్తీర్ణత సాధించాయన్నారు. జిల్లా పరిషత్‌, మైనారిటీ రెసిడెన్షియల్‌, ఆశ్రమ పాఠశాలలు, ఎయిడెడ్‌, ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం 92.43 కన్నా తక్కువ శాతం సాధించాయన్నారు. ఫెయిలైన విద్యార్థులు అధైర్యపడొద్దని సూచించారు. విద్యార్థుల మార్కుల జాబితాలను ఆయా పాఠశాలలకు పది రోజుల్లోనే పంపిస్తామన్నారు. పాఠశాలల నుండి, సంబంధిత పరీక్ష కేంద్రాల నుండి సమాచార లోపం కారణంగా కొంత మంది విద్యార్థుల ఫలితాలను విత్‌ హెల్డ్‌లో ఉంచినట్లు తెలిపారు. ఈ ఫలితాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రీ కౌంటింగ్‌ కోసం ప్రతి సబ్జక్టుకు రూ. 500డిడి కట్టి దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. పరీక్షలు ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం జూన్‌ 10 నుండి 24వ తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు. అతి తక్కువ వ్యవధిలోనే ఈ పరీక్షలు జరపాల్సి ఉన్నందు వల్ల తక్కువ వ్యవధిలోనే ఎస్‌ఎస్‌సి అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 27 తేదీ గడువు అని వెల్లడించారు. విద్యార్థులు పరీక్ష ఫీజును సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుకు చెల్లించవచ్చన్నారు. ఆయా సబ్జెక్టుల పరీక్షలకు రెండు రోజుల ముందు వరకు ఆలస్య రుసుము మరో రూ. 50 అదనంగా చెల్లించి కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇటీవల ఇంటర్‌ ఫలితాల్లో చోటు చేసుకున్న కొన్ని గందరగోళ పరిస్థితులను గమనంలో ఉంచుకుని ఈ సారి అలాంటివి పదో తరగతి పరీక్షల విషయంలో పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?