బల్దియా భూమి కబ్జా

పాతబస్తీలో రూ.కోటి విలువైన భూమిలో యథేచ్ఛగా నిర్మాణాలు
నిజాం కాలం నాటి టాయిలెట్‌, దోబిఘాట్‌ స్థలం అన్యక్రతం
అలియాబాద్‌ పూల్‌బాగ్‌లో అక్రమాల బాగోతం
ప్రజాపక్షం/హైదరాబాద్‌  ఒక వైపు కరోనా… మరోవైపు అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగా కొందరు అక్రమార్కులు జిహెచ్‌ఎంసికి చెందిన భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చంద్రాయణగుట్ట నియోజకవర్గం జంగమ్మెట్‌ డివిజన్‌ లక్ష్మి నగర్‌ బస్తీవాసులు ఆరోపించారు. అలియాబాద్‌ పూల్‌బాగ్‌ చమన్‌ ఎదుట సుమారు 300 గజాల భూమిలో ప్రజల సౌకార్యార్థం అప్పటి నిజాం ప్రభుత్వం బల్దియా ద్వారా స్త్రీ, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు, స్నానపు గదులు, దోబిఘాట్‌, డంపింగ్‌ పాయింట్‌లను కలిపి టాయిలెట్స్‌ కాంప్లెక్స్‌లు నిర్మించింది. 1970 సంవత్సరం వరకు వాటిని ప్రజలు వినియోగించుకున్నారని స్థానికులు తెలిపారు. తరువాత నిరుపయోగంగా ఉన్న టాయిలెట్‌ కాంప్లెక్స్‌ను కూల్చివేసి ఆ భూమిని ప్రజల సంక్షేమ, సామాజిక అవసరాలకు వినియోగించాలని కోరుతూ అప్పటి ఎంసిహెచ్‌ కమిషనర్‌కు లక్ష్మినగర్‌ బస్తీవాసులు అర్జీ పెట్టుకున్నారు. దీనికి ఎంసిహెచ్‌ కమిషనర్‌ సానుకులంగా స్పందించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయడంతో సిబ్బంది కూల్చివేసి, చదును చేయించి వదిలేశారు. దోబిఘాట్‌, పబ్లిక్‌ టాయిలెట్‌లు, చెత్త డంపింగ్‌ పాయింట్‌లు ఉన్న స్థలాలు జిహెచ్‌ఎంసికి చెందుతాయి. నగరంలో చాలా చోట్ల పబ్లిక్‌ టాయిలెట్స్‌ను తొలగించి, కమ్యూనిటీహాళ్లు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. సుమారు రూ.కోటి విలువైన ఈ భూమిని కబ్జా చేసేందుకు కొంతమంది రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని లక్ష్మినగర్‌ బస్తీవాసులు చెబుతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి న్యాయస్థానాన్ని, రెవెన్యూ, జిహెచ్‌ఎంసి అధికారులను తప్పుదొవ పట్టిస్తున్నారన్నారు. స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంపై 2018 మే నెలలో స్థానిక తహసీల్దార్‌, జిహెచ్‌ఎంసి అధికారులకు ఫిర్యాదు చేస్తే కూల్చివేశారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ నియంత్రణలో జిహెచ్‌ఎంసి, రెవెన్యూ అధికారులు తీరిక లేకుండా ఉన్న విషయాన్ని గమనించిన సదరు కబ్జాదారులు శనివారం భూమిని అక్రమించి నిర్మాణాలు చేపట్టారు. బస్తీ ప్రజలు నిర్మాణాలను అడ్డుకొని ప్రశ్నిస్తే గుండాలు, రౌడిషీటర్లలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు వాపోయారు. ప్రైవేట్‌ వ్యక్తులు స్థలం తమదేనని నకిలీ పత్రాలు చూపించి నిర్మాణాలు సాగిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ భూమి అని బండ్లగూడ తహసీల్దార్‌, చార్మినార్‌ జోన్‌ అధికారులు నిర్ధారించి, గతంలో కూల్చివేశారని తెలిపారు. అయితే కొంతమంది అధికారులు కబ్జాదారులకు వత్తాసు పలకడంతోనే యథేచ్ఛగా నిర్మాణాలు సాగిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. నిజాం కాలం నాటి దోబిఘాట్‌, టాయిలెట్‌లు, స్నానపు గదుల స్థలాన్ని రక్షించాల్సిన రెవెన్యూ, జిహెచ్‌ఎంసి అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌, జిహెచ్‌ఎంసి కమిషనర్‌లు స్పందించి వెంటనే ప్రభుత్వ స్థలాన్ని స్వాదీనం చేసుకొని ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు లేదా ప్లే గ్రౌండ్‌, లైబ్రరీ లాంటివి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?