బరిలో ఎవరో తేలేది నేడే

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యుర్థులు ఎంత మంది అనేది నేడు తేలనుంది. గురువారం సాయంత్రం 3.00 గంటల వరకు నామినేషన్లను విత్‌ డ్రా చేసుకునేందుకు సిఇసి గడువు విధించింది. దీంతో ఇక ఎంత మంది పోటీలో ఉన్నారనే దానిపై పూర్తి స్పష్టత రానుంది. 17 లోక్‌సభ స్థానాలకు గాను 646 మంది నామినేషన్లు దాఖ లు చేశారు. వివిధ కారణాల వల్ల 143 నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా 503 మంది నామినేషన్లు సరిగ్గా ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో అత్యధికంగా 189 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఇసి వెల్లడించింది. తక్కువ నామినేషన్లు వచ్చిన నియోజక వర్గాల్లో నాగర్‌ కర్నూలు, మహబూబ్‌నగర్‌ ఉన్నాయని, ఒక్కో చోట 12 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఇసి వెల్లడించింది. పరిశీలన అనంతరం ఆమోదం పొందిన నామినేషన్ల వివరాలు నియోజక వర్గాల వారీగా ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌ (189), ఆదిలాబాద్‌ (13), పెద్దపల్లి (17), కరీంనగర్‌ (16), జహీరాబాద్‌ (18), మెదక్‌ (18), మల్కాజిగిరి (13), సికింద్రాబాద్‌ (30), హైదరాబాద్‌ (19), చేవెళ్ల (24), మహబూబ్‌నగర్‌ (12), నాగర్‌ కర్నూలు (12), నల్లగొండ (31), భువనగిరి (23), వరంగల్‌ (21), మహబూబాబాద్‌ (18), ఖమ్మం ( 28 ) ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న డబ్బు, బంగారం, నార్కోటిక్‌ డ్రగ్స్‌ భారీగా పట్టుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రూ. 12,53,02,400 నగదు పట్టుబడింది. అంతే కాకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 2.45 కోట్ల విలువ చేసే నార్కోటిక్‌ డ్రగ్స్‌ను, 543 గ్రాముల బంగారాన్ని పోలీసు, ఎక్సైజ్‌శాఖ్‌ అధికారులు పట్టుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?