బయటకు రావొద్దు

ప్రజాపక్షం/హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంగా పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం హైఅలర్ట్‌ అయింది. స్కాట్లాండ్‌ నుండి వచ్చిన 21 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు బుధవారం పరీక్షలో తేలడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దని తేల్చిచెప్పింది. పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం ఈనెల 31 వరకు సెలవులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సెలవులను ఎంజాయ్‌ చేసేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. సొంతూళ్లకు, శుభకార్యాలకు, పర్యాటక ప్రాంతాల సందర్శనల కోసం వేరే ఊళ్లకు వెళ్తున్న వారు చాలా మందే ఉన్నారు. కళాశాల విద్యార్థులు కూడా అవసరం లేకున్నా రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. దీంతో పెనుప్రమాదం పొంచి ఉందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ముందస్తుగా హెచ్చరించింది. ‘విద్యాసంస్థలకు సెలవులిచ్చింది టూర్లకు, ఊళ్లకు వెళ్లేందుకు కాదు.. బయటకు రాకుండా చూసుకోండి’ అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్వయంగా చెప్పారంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు వహించాలి. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఈవెంట్లకు వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా ప్రభావంతో ప్రపంచం వణికిపోతున్న నేపథ్యంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏ మాత్రం సందేహం వచ్చినా అక్కడి నుంచి వారిని నేరుగా వికారాబాద్‌ హరిత రిసార్ట్‌, దూలపల్లి రిసార్టుల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. గత వారం రోజులుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా నిర్మాణుష్యంగా కనిపిస్తోంది. విదేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిచేందుకు గానూ 40 ప్రత్యేక బస్సులను, 15 అంబులెన్స్‌లను ఎయిర్‌పోర్టులో అందుబాటులో ఉంచారు. ఎయిర్‌పోర్టుకు వస్తున్న ప్రతి విమాన ప్రయాణికుడిని వైద్య బృంధాలు స్క్రీనింగ్‌ చేస్తున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?