బడ్జెట్‌ మోత భారీ కోత!

రూ. 1,82,914 కోట్ల అంచనాలతో 2020-21 రాష్ట్ర బడ్జెట్‌

రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అంకెలతో మోతమోగించింది. అయితే వివిధ రంగాలకు భారీగా కోత కోసింది. కనీవినీ ఎరుగని విధంగా రూ. 1,82,914కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గతం కన్నా రూ. 40 వేల కోట్లు అత్యధికంగా వుండటం విశేషం. అయితే రూ. 33,191.25 కోట్ల ద్రవ్యలోటును కాదనలేకపోయింది. ఈ సంఖ్యను నిలుపుకోవాలంటే అప్పులు తప్పనిసరి అని చెప్పకనే చెప్పింది. లేనిపక్షంలో ప్రకటిత పథకాలు, పెట్టుబడుల్లో కోతలు అనివార్యంగా కన్పించింది. రెవెన్యూ వృద్ధి రేటు సహజంగానే 6.3 శాతానికి పడిపోయింది. నిరుద్యోగులు, ఉద్యోగులకు మొండిచెయ్యి చూపింది. మిగులు బడ్జెట్‌ గొప్పలు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రవ్యలోటు తిప్పలను తప్పించలేకపోగా, అసాధారణరీతిలో పన్నేతర ఆదాయాన్ని సమకూర్చుకుంటామని చెప్పుకోవడం ఒకింత సాహసమే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలడం లేదని ఒకవైపు చెపుతూ, ఇలాంటి సాహసాలు చేయడం నేలవిడిచి సాము చేయడమే. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, శాసనమండలిలో వేముల ప్రశాంతరెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

సమతుల్యమైన : సిఎం

ప్రజాపక్షం / హైదరాబాద్‌: 2020- సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పూర్తి సమతుల్యతతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అభినందించారు. ఇది సంక్షేమ తెలంగాణ కోసం రూపొందించిన ప్రగతిశీల బడ్జెట్‌గా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరులు తెలంగాణ ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్‌ అని సిఎం అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం- అన్ని రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులున్నాయని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొని రాబడులు తగ్గి, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోతలు పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధి కుంటుపడకుండా ఉండే విధంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించడం అభినందనీయమన్నారు. తెలంగాణ గ్రామాలు, పట్టణాల వికాసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, సంక్షేమ పథకాల్లో మరింత మంది పేదలకు అవకాశం రావాలనే సంకల్పానికి, ఎన్నికల హామీల అమలుకు అనుగుణంగా బడ్జెట్‌ రూపొందించారన్నారు. బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన అనంతరం మంత్రి హరీశ్‌ రావును సిఎం ప్రత్యేకంగా అభినందించారు. మండలిలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, బడ్జెట్‌ రూపకల్పనలో పాలు పంచుకున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఇతర ఆర్థిక శాఖ అధికారులకు సిఎం శుభాకాంక్షలు తెలిపారు.

మళ్ళీ నేలవిడిచి సాము చేసిన బడ్జెట్‌ వెంకటరెడ్డి

శాసనసభ, శాసన మండలిలో 2020- గాను ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ మరోసారి నేల విడిచి సాము చేసినట్లుగా ఉందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. గత ఏడాది తొలుత రూ.1.82 లక్షల కోట్ల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి దానిని రూ. 1.43 లక్షల కోట్లకు కుదించారన్నారు. ఈ సారి కూడా అవాస్తవిక అంచనాలతో రూ.1.82 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు చివర్లో కోతలు తప్పవు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. మిగులు బడ్జెట్‌ అని గొప్పలు చెప్పుకున్నా రూ. 33 వేల కోట్ల ద్రవ్యలోటును చూపడం డొల్లతనానికి నిదర్శనమని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. దానిని అధిగమించేందుకు అసాధారణ రీతిలో రూ.31వేల కోట్లు పన్నేతర ఆదాయాన్ని సమకూర్చుకుంటామనడం అత్యాశే అవుతోందన్నారు. సర్కారు ఆస్తులు, భూములను అమ్మినా కూడా ప్రభుత్వం వివిధ పద్దుల కింద భారీగా పెంచామని చెప్పుకుంటున్న నిధులు పూర్తి స్థాయిలో విడుదలయ్యే అవకాశం లేదన్నారు. త్వరలో జరి గే జిహెచ్‌ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10వేల కోట్లు కేటాయించారని అన్నారు. నిరుద్యోగులు, ప్రభుత్వోద్యోగులకు బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపిందని చాడ విమర్శించారు. పిఆర్‌సిపై స్పష్ట త లేదని, నిరుద్యోగులకు గత బడ్జెట్‌లో నిధు లు కేటాయించి, ఈ సారి వాటినీ కేటాయించలేదన్నారు. కొత్తగా డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేవలం 1లక్ష మాత్రమే మంజూరు చేయడం ఎంగిలి మెతుకులు చిలకరించినట్లే అవుతుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నామమాత్రంగా నిధులు కేటాయించారని, ఇది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే అవుతుందన్నారు. భూ రికార్డులు సరిచేయడానికి కూడా తగిన కేటాయింపు లు లేవని, రూ.25వేల పైగా ఉన్న వ్యవసాయ రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేయడం ద్వారా ప్రయోజనం ఉండదని చాడ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అరచేతిలో వైకుంఠం చూపారు విక్రమార్క

పేరు తో సిఎం కెసిఆర్‌ ప్రజలను మరొకసారి మోసం చేశారని కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకులు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని సిఎం చూపించారని ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సీతక్క, జగ్గారెడ్డి, పొడెం వీరయ్యలతో కలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వ్యాఖ్యానించారు. ఆదాయం బాగా ఉన్నప్పటికినీ రాష్ట్ర వృద్ధి రేటు 15 శాతం మాత్రమే ఉందన్నారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదన్నారు. గతం కంటే 2015 బడ్జెట్‌ వృద్ధి 15శాతం, 2016 13 శాతం ఉందన్నారు. అలాగే 2017 15శాతంగా వృద్ధి ఉన్నదని పేర్కొన్నారు. 2018 అర్థిక సంవత్సరంలో మాత్రం 17శాతం, 2019- మైనస్‌ 19శాతం వృద్ధి ఉందని ఆయన వివరించారు. తిరిగి రూ.40వేల కోట్లు అదనంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టగానికి కొత్తగా రాష్ట్రం సాధించినవృద్ధి ఏముందని ఆయన ప్రశ్నించారు. 2020- మాత్రం ప్లస్‌ 29 శాతం పెంచి చూపించి ప్రజలను మోసం చేసేలా బడ్జెట్‌ ఉం దని ఆయన విమర్శించారు. ఆర్థిక మాంద్యం, బిజెపి విధానాల వల్ల తగ్గిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 2019 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో 1.82లక్షల కోట్లు పెట్టి వాస్తవిక బడ్జెట్‌ వచ్చేసరికి దానిని దాదాపు రూ.1.42లక్షల కోట్లకు కుదించారు. ఈసారి కూడా 1.82లక్షల కోట్లతోనే బడ్జెట్‌ను రూపకల్పన చేశారని ఆయన విమర్శించారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, ఇతర హామీలను పొందుపరుచలేదని ఆయన ఆరోపించారు.

నిరాశ కలిగించిన బడ్జెట్‌ కోదండరామ్‌
కేటాయింపులను పరిశీలిస్తే చాలా రంగాల్లో నిరాశ కలిగించిందని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ అన్నారు.నిరుద్యోగ సమస్యపై సిఎం కెసిఆర్‌ చేతులెత్తేశారన్నారు. ప్రతి ఏటా అప్పులు పెరిగిపోతున్నాయని, బడ్జెట్‌ కేటాయింపుల్లో 2014 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వాస్తవ అంచనాలకు రూ. 25 వేల కోట్లు తక్కువగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని టిజెఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఆర్థిక సంవత్సరంలో రూ.9,500ల కోట్ల అప్పు ల నుండి 2017 సంవత్సరానికి రూ.49 వేల కోట్ల అప్పు పెరిగిందని, ఈ సారి కూడా దాదాపుగా రూ. 35 వేల కోట్ల అప్పు చేసి అవకాశం ఉన్నదని చెప్పారు. అప్పులతో వడ్డీల శా తం విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో 33 శాఖలలో భారీగా కోతలు విధించారని, గతంలో కేటాయించిన ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ నిధులలో 50 శాతం కూడా ఖర్చు చేయలేదని వివరించారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం నిరుద్యోగులలో బాగా నిరాశ కలిగించిందన్నారు. వైద్య రంగానికి పెద్దగా పెంపు కనిపించలేదని తెలిపారు. రుణమాఫీ విషయంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రైతులు, రైతు సంఘాలు ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాల్సిన అసవరం ఉందన్నారు. ఈ సారి వృద్ది రేటు పడిపోయిందని, ఈ సారి కూడా సంక్షేమ పథకాల్లో భారీగా కోత పడే ప్రమాదం ఉన్నదని, గత బడ్జెట్‌లో ఎంబిసి కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్ల కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని వివరించారు. 2020 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంబిసిలకు రూ.500 కోట్లు కేటాయించారని, ఇది కూడా ఖర్చు చేస్తారనే నమ్మకం లేదని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ విషయాలను పుస్తక రూపంలో తీసుకొచ్చి ప్రజలల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?