బంగ్లాదేశ్‌ రికార్డు విజయం

విజృంభించిన మెహదీ హసన్‌, వెస్టిండీస్‌ వైట్‌వాష్‌
ఢాకా: బంగ్లాదేశ్‌ మరో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 184 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలి సారిగా ఇన్నింగ్స్‌ విజయాన్ని సాధించిన బంగ్లాదేశ్‌కు టెస్టుల్లో ఇదే అతి పెద్ద విజయం కావడం మరో విశేషం. బంగ్లాదేశ్‌ బౌలర్‌ మెహదీ హసన్‌ మిర్జా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 12 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఇతని ధాటికి కరీబియన్‌ జట్టు విలవిలలాడింది. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన మెహదీ హసన్‌, రెండో ఇన్నింగ్స్‌లో కూడా 5 వికెట్లతో విజృంభించాడు. ఇతని ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగులకు కుప్పకూలిన వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 213 పరుగులు మాత్రమే చేసి భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌ను బంగ్లా మూడు రోజుల్లోనే ముగించేసింది. అంతకుముందు మహ్మూదుల్లా (136) సెంచరీతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 508 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ విజయంతో బంగ్లాదేశ్‌ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇటీవలే భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా క్లీన్‌ స్పీప్‌కు గురైన వెస్టిండీస్‌ తాజాగా పసికూన బంగ్లాదేశ్‌ చేతిలో కూడా వైట్‌వాష్‌ కావడం గమనర్హం. ఆదివారం 75/5 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 86 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న హెట్మేయిర్‌ (39; 53 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులు చేసి మెహదీ హసన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత మరో ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ డొవ్రిచ్‌ (37) పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం మరింతగా చెలరేగిన మెహదీ హసన్‌ వరుసక్రమంలో వికెట్లు తీస్తూ విండీస్‌ను 36.4 ఓవర్లలో 111 పరుగులకే కట్టడి చేశాడు. విజృంభించి ఔలింగ్‌ చేసిన మెహదీ హసన్‌ 7 వికెట్లు పడగొట్టగా.. సాకీబుల్‌ హసన్‌కు మూడు వికెట్లు దక్కాయి. దీంతో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌కు 397 పరుగులతో వెనుకబడిన విండీస్‌ జట్టు ఫాలోఆన్‌కు గురైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన వెస్టిండీస్‌కు మరోసారి ఆరంభం కలిసి రాలేదు. ఈ సారి కూడా 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ, ఈ సమయంలో షై హోప్‌, హెట్మేయిర్‌ ఇద్దరూ కలిసి విండీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కు 56 పరుగులు జోడించిన అనంతరం హోప్‌ (75 బంతుల్లో 25) మెహదీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత మరింతగా పుంజుకున్న బంగ్లా బౌలర్లు కరీబియన్‌ బ్యాట్స్‌మన్లపై విరుచుకుపడ్డారు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపు హెట్మేయిర్‌ మాత్రం అద్భుతమైన బ్యాటింగ్‌తో విండీస్‌ స్కోరుబోర్డును ముందుకు సాగించాడు. అయితే చివర్లో హెట్మేయిర్‌ 92 బంతుల్లో 1 ఫోర్‌ 9 సిక్సర్లతో 93 పరుగులు చేసి హసన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వావ రోచ్‌ (37 నాటౌట్‌), లెవీస్‌ (20) పరుగులు చేసి విండీస్‌ స్కోరును 200 పరుగులు దాటించారు. చివర్లో లెవీస్‌ ఔటవ్వడంతో విండీస్‌ 59.2 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్‌ 5, తైజుల్‌ ఇస్లాం 3 వికెట్లు తీశారు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 12 వికెట్లు పడగొట్టిన మెహదీ హసన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ఆల్‌ రౌండర్‌ ప్రదర్శన చేసిన బంగ్లా కెప్టెన్‌ సాకీబుల్‌ హసన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు లభించాయి.

DO YOU LIKE THIS ARTICLE?