ఫైనల్లో నాదల్‌

మహిళల తుది పోరులో ఒసాకాతో క్విటోవా ఢీ
సెమీస్‌లో ఓడిన కొలిన్స్‌, ప్లిస్కోవా
ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌
మెల్‌బోర్న్‌: ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌శ్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో స్పెయిన్‌ బుల్‌ రాఫెల్‌ నాదల్‌ ఫైనల్లో ప్రవేశించాడు. మహిళల విభాగంలో నాలుగో సీడ్‌ జపాన్‌ సంచలనం నయోమి ఒసాకా, ఎనిమిదో సీడ్‌ చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి పెట్రా క్విటోవా సెమీస్‌లో విజయాలు సాధించి తుది పోరుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు వీరిద్దరిలో ఎవరు కూడా ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ నెగ్గలేదు. ఇక ఫైనల్లో వీరిలో ఎవరు గెలుస్తారో వారే కొత్త చాంపియన్‌గా అవతరిస్తారు.
ప్లిస్కోవా ఔట్‌..
గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఏడో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)కు షాక్‌ తగిలింది. జపాన్‌ స్టార్‌ క్రీడాకారిణి ఒసాకా చేతిలో ప్లిస్కోవాకు ఓటమి తప్పలేదు. ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ మొదటి సెమీఫైనల్లో నాలుగో సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌) 6 4 6 ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇద్దరు హోరాహోరీగా తలపడినా చివర్లో ఆధిక్యాన్ని కాపాడుకున్న ఒసాకాకు గెలుపు వరించింది. తొలి సెట్‌ను కోల్పోయిన ప్లిస్కోవా తర్వాతి సెట్‌లో మాత్రం ఆసాధారణ ఆటను కనబర్చింది. ప్రత్యర్థిపై పూర్తి వరుసదాడులు చేస్తూ రెండో సెట్‌ను గెలుచుకుంది. కాగా, ఆఖరిదైన మూడో సెట్లో మాత్రం జపాన్‌ క్రీడాకారిణి పుంజుకోవడంతో ప్లిస్కోవాకు ఓటమి తప్పలేదు. మహిళల రెండో సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 7 6 అమెరికాకు చెందిన అన్‌ సీడెడ్‌ డానియెల్లి కొలిన్స్‌ను ఓడించి ఫైనల్లో దూసుకెళ్లింది. తొలి సెట్‌ను టై బ్రేకర్‌లో గెలుచుకున్న క్విటోవా తర్వాతి సెట్‌లో మాత్రం చెలరేగి ఆడింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 6 రెండో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. అన్‌ సీడెడ్‌గా బరిలోకి దిగిన అమెరికా నయా ఆశాకిరణం కొలిన్స్‌ ఈ టోర్నీలో అద్భుతమైన క్రీడా ప్రతిభను కనబర్చింది. ఇక మహిళల ఫైనల్స్‌లో ఒసాకా, క్విటోవాలు తలపడనున్నారు. గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్న జపాన్‌ స్టార్‌ ఒసాకా గత ఏడాది జరిగిన అమెరికా ఓపెన్‌ గ్రాండ్‌శ్లామ్‌ టైటిల్‌ గెలుచుకుంది. ఫైనల్లో అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ను ఓడించడం విశేషం. మరోవైపు చెక్‌ రిపబ్లిక్‌ స్టార్‌ క్రీడాకారిణి 2011, 2014లో వింబుల్డన్‌ ట్రోఫీలను గెలుచుకుంది. ఇక ఆస్ట్రేలియా ఓపెన్‌లో వీరిద్దరిలో ఎవరు గెలిచినా కొత్త చరిత్ర అవుతోంది. విజేతగా నిలిచేవారు మహిళల విభాగంలో కొత్త చాంపియన్‌గా తమ పేరు లిఖించుకుంటారు.
స్టెఫానొస్‌ పోరాటం ముగిసింది..
ఆస్ట్రేలియా ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో గ్రీస్‌ యువ సంచలనం స్టెఫానొస్‌ సిట్సిపాస్‌ పోరాటం సెమీస్‌లో ముగిసింది. టెన్సిస్‌ దిగ్గజాలను ఓడించి సెమీస్‌ వరకు వచ్చిన స్టెఫానోస్‌ చివరికి రెండో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్రీ క్వార్టర్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ 20 సార్లు గ్రాండ్‌శ్లామ్‌ టైటిళ్లు గెలుచుకున్న స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ను ఓడించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. తర్వాత క్వార్టర్‌ ఫైనల్లో బౌటిస్టా అగాట్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన స్టెఫానొస్‌ ఇంతవరకు రావడం సంతోషంగా ఉందన్నాడు. టోర్నీలో తన అభిమాన ఆటగాడు ఫెదరర్‌ను ఓడించడం జీవితంలో మరిచిపోలేని తీపి జ్ఞాపకంగా అభివర్ణించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ స్పెయిన్‌ దిగ్గజం, రెండో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ 6 6 6 14వ సీడ్‌ స్టెఫానొస్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించాడు. ఇక శుక్రవారం జరిగే పురుషుల మరో సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌, లుకాస్‌ పౌలెలు తలపడనున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో వారు ఆదివారం జరిగే పురుషుల ఫైనల్లో రాఫెల్‌ నాదల్‌ను ఢీ కొంటారు.

DO YOU LIKE THIS ARTICLE?