ప్లీజ్‌.. నన్ను చూడండి!

పదవుల కోసం పాట్లు : యజ్ఞం చుట్టూ చక్కెర్లు
కెసిఆర్‌ కళ్లలో పడే ప్రయత్నాలు

ప్రజాపక్షం/ హైదరాబాద్‌ : నామినేట్‌ పదవులకు టిఆర్‌ఎస్‌ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ను ప్రకటించిన సిఎం కెసిఆర్‌ త్వరలోనే మరిన్ని నామినేట్‌ పదవులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కెసిఆర్‌ కళ్లలో పడేందుకు కొంద రు సీనియర్‌ నేతలు చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. కెసిఆర్‌ను, ఆయన వెంట ఉండే కొందరు నేతలను కలిసేందుకు వారు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఎలాంటి అవకాశం వచ్చినా వారు వదులుకోవడం లేదు. ఇందులో భాగంగానే ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కెసిఆర్‌ చేపడుతున్న చండీయాగం దర్శనానికి వెళ్తున్నకొందరు నేతలు పనిలో పనిగా తమ మనుసులోని మాటలను సిఎం సన్నిహితంగా ఉన్నవారి చెవిలో వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి కొందరు నేతలు యాగం వద్ద ఉంటూ కెసిఆర్‌ కళ్లలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ముఖ్యనేతలు తమకు ఉన్న ప్రత్యేకతను సీనియర్ల వద్ద చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో పాటు తమ సామాజిక వర్గం, తదితర అంశాలపై ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో తమకు పోటీ చేసేందుకు అవకాశం దొరకని కొందరు ముఖ్యనేతలు, తాజా మాజీ ఎంఎల్‌ఎలు కూడా కొందరు నామినెట్‌ పదవులపై ఆశ లు పెట్టుకున్నారు. మరోవైపు ఇంకొందరు నేతలు త్వరలో రాబోయే ఎంఎల్‌సి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే విషయాన్ని సిఎం కెసిఆర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నేరుగా కెసిఆర్‌కు చెప్పే పరిస్థితి లేకపోవడంతో సిఎం వెంట ఉండే కొందరు ముఖ్యనేతలతో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తాజా మాజీ మంత్రులలో ఒకరిద్దరు ఇతర పదవులను ఆశించగా, మంత్రి పదవుల కోసం కొందరు ఎంఎల్‌సిలు ప్రయత్నిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?