ప్లాస్మాథెరపీకి సన్నాహాలు

గాంధీ ఆసుపత్రిలో ముగ్గురికి చికిత్స చేసేందుకు వైద్యుల ఏర్పాట్లు
కరోనా కట్టడిపై రేకెత్తుతున్న ఆశలు
రాష్ట్రంలో క్రమేపి తొలుగుతున్న ఆంక్షలు
పది జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్‌
కరోనా ఫ్రీ జిల్లాగా సంగారెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్‌: ప్రాణాపాయం నుంచి బయటపడేస్తున్న ప్లాస్మాథెరపీ ఎట్టకేలకు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. రెండు రోజుల క్రితమే ఈ థెరపీకి కేంద్రం అనుమతి లభించింది. దీంతో గాంధీలో సీరియస్‌గా ఉన్న ముగ్గురు కరోనా పేషంట్లకు ఈ చికిత్స చేసేందుకు వైద్యులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ చికిత్స కోసం కరోనా పాజిటివ్‌ వచ్చి పూర్తిగా నయమైన వారి రక్తం అవసరం. వీరి రక్తం నుంచి ప్లాస్మాను వెలికి తీసి సీరియస్‌గా ఉన్న పేషంట్లకు ఎక్కిస్తారు. ఇది వారిలోని కరోనా వైరస్‌పై పోరాడి విముక్తులను చేస్తుంది. ఇలాంటి వారి రక్త సేకరణలో వైద్యులు ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఒకరి ప్లాస్మా థెరపి చేయగా సదరు పేషెంట్‌ పూర్తిగా కోలుకున్నారు. ఢిల్లీలో విజయవంతం కావడంతో ఇప్పటికే ఈ చికిత్స కోసం అనుమతి కోరిన రాష్ట్రాలకు కేంద్రం అనుమతులు ఇచ్చేస్తోంది. గుజరాత్‌లో ఆదివారం ఒకరికి ప్లాస్మాథెరపి చికిత్స మొదలుపెట్టారు. కరోనా నుంచి కోలుకున్న స్మృతి టక్కర్‌ అనే మహిళ తన రక్తాన్ని ఇచ్చింది. బెంగ్లూర్‌లోనూ ప్లాస్మాథెరపి చికిత్స మొదలు పెట్టారు. మహారాష్ట్రకు ఈ చికిత్స కోసం అనుమతి లభించింది. దక్షిణ కొరియాలో ఇది పూర్తిగా విజయవంతం అయింది. దీంతో అమెరికాలోనూ ఈ చికిత్స అందించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రారంభించిన రాష్ట్రాలలో ఇది విజయవంతమైతే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా సివియర్‌ పేషెంట్లకు ఈ చికిత్స చేయనున్నారు. దీంతో కరోనాతో జరిగే మరణాలను అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కట్టడిపై ఆశలు రేకెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా పది జిల్లాల్లో కొత్త కేసులు ఏవీ నమోదు కావడం లేదు. శనివారం కేవలం ఏడు కేసులు నమోదు కాగా ఇందులో జిహెచ్‌ఎంసిలో ఆరు, ఒకటి వరంగల్‌ అర్బన్‌. మిగిలిన అన్ని జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వరంగల్‌ రూరల్‌, వనపర్తి, భువనగిరి జిల్లాల్లో కొత్త కేసులు లేవు. కరోనా ఫ్రీ జిల్లాగా సంగారెడ్డి మారింది. ఇక్కడ ఎనిమిది కేసులు ఉండగా ఎనిమిది మందికి నెగెటివ్‌ వచ్చి కోలుకున్నారు. ఖమ్మం జిల్లాల్లో గత 20 రోజులుగా కొత్త పాజిటివ్‌ కేసులు లేవు. అలాగే నిజామాబాద్‌ జిల్లాలో గత ఆరు రోజులుగా, కామారెడ్డి జిల్లాలో గత పదిరోజులుగా కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. భద్రాద్రి జిల్లాలో గత నెల నుంచి పాజిటివ్‌ కేసులు లేవు. మహబూబ్‌నగర్‌లో క్వారంటైన్‌ ఉన్న జర్నలిస్టులకు నెగెటివ్‌ తేలింది. ఖమ్మం జిల్లాలో కంటాన్మెంట్‌ ప్రాంతాలను తగ్గించారు. వనపర్తిలో లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చారు. పెద్దతండా, మోతినగర్‌లను రెడ్‌జోన్ల నుంచి తొలగించారు. అయితే కరోనా తీవ్రత ఉన్న ప్రాంతాల్లో మాత్రం రోజురోజుకు కఠిన చర్యలు, ఆంక్షలు తీసుకుంటున్నారు. జనగామ జిల్లా చౌటుప్పల్‌లో కరోనా ప్రభావంతో ఒక రోజు పూర్తి బంద్‌ను స్వచ్ఛంగా పాటించారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో జూన్‌ 9వరకు కూరగాయల విక్రయాలను నిషేధించారు. అయితే దేశ వ్యాప్తంగా జూన్‌ వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఐసిఎంఆర్‌ స్పష్టం చేసింది. బిసిజి వంటి కొన్ని సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్‌ వరకు లాక్‌డౌన్‌ ఉన్నప్పటికి ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపాయి. జనాభా ఎక్కువ ఉన్న భారత్‌లో లాక్‌డౌన్‌ అప్పటి వరకు తప్పనిసరి అవుతుందని కూడా పేర్కొన్నాయి. ఎటువంటి సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఇండియాలో ఇది తప్పనిసరి తెలిపింది. మొత్తం కరోనా ఫ్రీగా మారేంత వరకు రెడ్‌జోన్లలో కష్టాలు తప్పవు. గ్రీన్‌ జోన్స్‌లో కొంతమేర సడలింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యంత తీవ్రంగా ఉన్న జిహెచ్‌ఎంసిలోనూ తగ్గుముఖం పడుతుండడంతో 45 కంటాన్మెంట్‌ ప్రాంతాలను తగ్గించారు. ప్రస్తుతం 190 కంటాన్మెంట్‌ ప్రాంతాలు ఉన్నాయి. ప్రస్తుతం జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారే అనుమానంతో ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?