ప్లాన్‌ రివర్స్‌?

డిఫెన్స్‌లో టిఆర్‌ఎస్‌
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై సైలెంట్‌
దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు దెబ్బ
ప్రతిపక్షాలు స్పందించాకే సిఎం సమీక్ష
వారం ఆలస్యంగా నామ మాత్రపు స్పందన
నేరుగా పోతిరెడ్డిపాడు పేరు ప్రస్తావించని వైనం
కేవలం బిజెపిపైనే టిఆర్‌ఎస్‌ ఎటాక్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌: శ్రీశైలం ప్రాజెక్టు నుండి నేరుగా రాయలసీమలకు కృష్ణా జలాలను తరలించే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ సామర్థ్యం రెట్టింపు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుండడంతో తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మరక్షణలో పడినట్లయింది. నిన్న మొన్నటి వరకు నదీ జలాల విషయంలో ఎపి సిఎం వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డితో సఖ్యతతో ఉన్నట్లు కన్పించిన తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర్‌రావుకు ప్రస్తుత పరిణామం కొంత ఇబ్బందికరంగానే మారింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కుల నుండి 80వేల క్యూసెక్కులకు పెంచుతూ, రోజుకు 6 టిఎంసిల నుండి 8 టిఎంసిల వరకు నీళ్ళను తరలించుకునేలా ఎపి ప్రభుత్వం ఈ నెల 5వ తేదీన జిఒ జారీ చేసింది. పనులకు సంబంధించి సుమారు రూ. 6,830 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చింది. ఈ పనులు
పూర్తయితే కృష్ణా నదీ జలాలపై ఆధారపడే దక్షిణ తెలంగాణ ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులకు ఇబ్బందే. ముఖ్యంగా ఎస్‌ఎల్‌బిసి, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయల్‌ సాగర్‌ ఎత్తిపోతలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. సా ధారణంగా ఇలాంటి సెంటిమెంట్‌ విషయాల్లో అందరికంటే ముందే స్పం దించే టిఆర్‌ఎస్‌ నేతలు ఇరు రాష్ట్రాల సిఎంల మధ్య సన్నిహిత సంబంధాల తో మౌనాన్నే ఆశ్రయించారు. వరుసగా కాంగ్రెస్‌, సిపిఐ, టిజెఎస్‌ పార్టీలు ఈ అంశాన్ని లేవనత్తాయి. సిఎం స్పందించాలని కోరాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో దాదాపు వారం రోజులు ఆలస్యంగా సోమవారం రాత్రి సిఎం కెసిఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఎపి నిర్ణయంపై కృష్ణా వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు ఫిర్యాదు చేస్తామని, సుప్రీంకోర్డులో న్యాయపోరాటం చేస్తామని అ నంతరం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అందులో ఎక్కడా కూడా పోతిరెడ్డి పాటు అనే పేరు ప్రస్తావించకుండా ‘కొత్త ఎత్తిపోతల ప థకం’ అని పేర్కొన్నారు. సాధారణంగా ప్రత్యర్థులను కాని, ఆంధ్రప్రదేశ్‌ కా రణంగా తెలంగాణకు జరిగే ఏ అన్యాయంపైనైనా విరుచుకుపడేందుకు కెసిఆర్‌ ఎలాంటి అవకాశాన్ని జారవిడుచుకోరు. ఇంతటి కరోనా కల్లోలంలో కూడా రాష్ట్రంలో ప్రతిపక్షాలపై మీడియా సమావేశాల్లో అనేక మార్లు విరుచుకుపడడమే ఇందుకు నిదర్శనం. కానీ ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు టిఆర్‌ఎస్‌ నేతలు కూడా కేవలం బిజెపిని ఉద్దేశించి అ టు ఎపి, ఇటు తెలంగాణలో ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారే తప్ప ఇతర పార్టీల జోలికి వెళ్ళకపోవడం, ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది.
అనుకుందలా.. జరుగుతుందిలా.. సిఎంగా వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే, సిఎం కెసిఆర్‌ ఆయనకు స్నేహ హస్తం చాచారు. నదీ జలాల వివాదం లేకుండా, బేషజాలకు పోకుండా చర్చల ద్వారానే పరిష్కరించుకుందామని ఆహ్వానించడంతో జగన్‌ ప్రగతిభవన్‌కు వచ్చి కెసిఆర్‌తో భేటీ కూడా అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం చేసి, ఇరు రాష్ట్రాలు ప్రయోజనం పొందాలని కూడా సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారు. ఆ తరువాత ఇరు రాష్ట్రాల అధికారులు కూడా సమావేశమయ్యారు. సిఎం కెసిఆర్‌ ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా తెలంగాణ శాసనసభలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి అనుసంధానం గురించి ప్రకటించారు. తమ ప్లాన్‌ చెబితే ప్రతిపక్షాలకు మతిపోతుందని కూడా వ్యాఖ్యానించారు. దుమ్ముగూడెం నుండి గోదావరి జలాలను నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌కు తీసుకుపోతామని, అక్కడ నుండి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా డ్యామ్‌లోకి నీటిని ఎత్తిపోస్తామన్నారు. అక్కడ నుండి గోదావరి జలాలు కుడి, ఎడమ కాలువ ద్వారా పోతాయని, అలాగే సాగర్‌లో నీటి నిలువను కొనసాగిస్తూ శ్రీశైలం ప్రాజెక్టు వద్ద రివర్స్‌ పంపింగ్‌ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోస్తామని చెప్పారు. ఎగువ నుండే మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు, వికారాబాద్‌ వరకు నీళ్లు పారిస్తామన్నారు. అయితే, ఈ ప్రణాళికపై ఎపి సిఎం జగన్‌ ఎన్నడూ బహిరంగంగా నోరు విప్పలేదు. అప్పట్లోనే గోదావరి జలాలను పోలవరం నుండి తరలించేందుకు, మధ్యలో గుంటూరు జిల్లా బొల్లేపల్లి వద్ద 150 టిఎంసిల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. తాజాగా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచేశారు. తద్వారా సిఎం కెసిఆర్‌ ప్లాన్‌తో సంబంధం లేకుండా కృష్ణా డెల్టాకు బొల్లేపల్లి ద్వారా గోదావరి జలాలు పారించడంతో పాటు, పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు తరలించే పని చేపడుతున్నారు. ఇక తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఇరు రాష్ట్రాల జలాలకు సంబంధించి బహిరంగంగా ప్రకటనలు చేస్తే, ఎపి సిఎం జగన్‌ మాత్రం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?