ప్రైవేటు ల్యాబ్‌లకే పరుగులు

తీరని రోగుల కష్టాలు
సర్కార్‌ ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణకు తిప్పలు

ప్రజాపక్షం/ సిటీబ్యూరో : కార్పొరేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామంటున్న ప్రభుత్వం మాటలకే పరిమితమవుతోంది. ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సకు వస్తున్న రోగులు పరీక్షలకు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించక తప్పడంలేదు. ఆసుపత్రుల్లో ఉన్నతాధికారులైనా కనీసం ఆసుపత్రుల బాగోగులు చూసుకోవడంలేదు. ఏదో వచ్చామా.. వెళ్లామా అనే విధంగా మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరికరాల పని తీరుపై ఆరా తీయలేకపోతున్నారు. ఒక్కోసారి నెలల తరబడి కూడా ఈ పరికరాలు అందుబాటులో ఉండకపోయి నా చర్యలు చేపట్టలేకపోతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో యంత్రాలు పదే పదే మొరాయిస్తున్నా వాటి గురించి అధికారులు పట్టించుకోలేకపోతున్నారు.గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో పలు రక్త పరీక్షలు ఇక్కడ అందుబాటులో లేవంటూ బయట చేయించుకోమని రోగులకు వైద్యులు చెబుతున్నారు. గాంధీలో అయితే ఏకంగా ఇన్‌పేషెంట్‌లో చికిత్స పొందుతున్న రోగు ల నుంచి రక్త పరీక్షల నిమిత్తం బయటి ల్యాబ్‌ వ్యక్తు లే రక్తాన్ని తీసుకొని వెళుతున్నారు. పైగా రోగుల నుంచి చిన్నచిన్న పరీక్షలకు సైతం రూ.500లు వసూలు చేస్తున్నారు. ఒక్క గాంధీ ఆసుపత్రిలోనే కాకుండా ఇతర ఆసుపత్రుల్లో కూడా ఇదే తతంగం నడుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డెంగీ నిర్ధారణ కిట్ల కొరత.. : డెంగీ నగరాన్ని వణికిస్తోన్న వ్యాధి. ఈ ఏడాది ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలో దాదాపు 80 మంది వరకు ఈ వ్యాధి బారిన పడ్డా రు. ఈ ఏడాది విషయం ఇలా ఉంటే గతేడాది 632 డెంగీ కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. దీనికితోడు నగరంలోని ప్రభుత్వాసుపత్రు ల్లో డెంగీ నిర్ధారణ కొట్ల కొరత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యాధి నిర్ధారణకు ప్రభుత్వాసుపత్రుల నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు వెళుతున్నారు. డెంగీ నిర్ధారణకు సిరాలజీ, ఎన్‌ఎస్‌-1యాంటిజన్‌ అనే రెండు పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ అవుతోంది. ఇందులో ఎన్‌ఎస్‌-1 యాంటిజన్‌ పరీక్ష ఖచ్చితమైన ఫలితాన్నిస్తోంది. దీంతో వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి చికిత్స అందించవచ్చు. ప్రాథమిక దశలోనే చికిత్స అందడంతో రోగి పూర్తి గా కోలుకునే అవకాశముంది. ఈ పరీక్షలకు కాస్తా ఖర్చుతో కూడుకోవడంతో రోగులు ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.ఈ పరీక్షకుబయట రూ. 1500నుంచి రూ.2000వరకు ఉంటుంది. ఇం దుకుగాను ప్రత్యేక యంత్రాలు, కిట్లు అందుబాటులో ఉండాలి. కానీ ప్రభుత్వాసుపత్రుల్లో ఇవి అందుబాటులో ఉండటంలేదు. ఉస్మానియా ఆసుపత్రిలో కేవలం సిరాలజీ టెస్టు మాత్రమే అందుబాటులో ఉంది.నాంపల్లి,బార్కాస్‌,మలక్‌పేట్‌,శాలిబండ, గో ల్కొండ ఏరియా ఆసుపత్రుల్లో ఈ పరీక్ష లు అసలు నిర్వహించడంలేదు. దీంతో రోగులు సర్కార్‌ ఆసుపత్రుల నుంచి ప్రైవేటుకే పరుగులు తీస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?