ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత మహిళా జట్టుకు చుక్కెదురు

చెలరేగిన ఆన్య, రెండు వికెట్లతో ఇంగ్లాండ్‌ మహిళా జట్టు గెలుపు

ముంబయి: ఇంగ్లాండ్‌ మహిళా క్రికెట్‌ జట్టుతో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత మహిళా బోర్డు ప్రెసిడెంట్‌ ఎలెవన్‌ జట్టుకు చుక్కెదురైంది. భారత్‌, ఇంగ్లాండ్‌ మహిళా జట్ల మధ్య ఈ నెల 22 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభంకానుంది. అది ముగిసన అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆరంభమవుతుంది. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్‌ జట్టు వన్డే సిరీస్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తమ సత్తా చాటింది. భారత లెవన్‌ జట్టుకు టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధనా సారథ్యం వహించింది. సోమవారం ఇక్కడ భారత మహిళా ప్రెసిడెంట్‌ లెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ మహిళా జట్టు 2 వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌వుమెన్స్‌లు మరోసారి చేతులెత్తేశారు. ఫలితంగా మొదట బ్యాటింగ్‌ చేసిన భారత ఎలెవన్‌ జట్టు 49 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఆన్య ష్రుబ్‌సొలే (4/30) విజృంభించి బౌలింగ్‌ చేయడంతో భారత జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపెట్టారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బాట్స్‌వుమెన్స్‌ను హడలెత్తించారు. వీరి ధాటికి ఇంగ్లాండ్‌ కూడా వెనువెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చివర్లో హేదర్‌ నైట్‌ (64 నాటౌట్‌; 86 బంతుల్లో 9 ఫోర్లు) అద్భుతమైన బ్యాటింగ్‌తో తమ జట్టును గట్టెక్కించింది. ఫలితంగా ఇంగ్లాండ్‌ 37.3 ఓవర్లలో 157/8 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో కొమల్‌ జన్జాద్‌ (3/14) ఆకట్టుకుంది. ఐసిసి వుమెన్స్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం ముంబయి వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మహిళా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా 2 విజయం సాధించింది. ప్రస్తుతం భారత జట్టు వన్డేల్లో పటిష్టంగా ఉంది. టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమిపాలై టోర్నీకి దూరమైన భారత జట్టు తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తమ సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ టీమిండియా రెండు విజయాలు సాధించింది. ప్రస్తుతం మరో సమరానికి సిద్ధమవుతోంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు లేకుండా బరిలో దిగిన భారత్‌ ఎలెవన్‌ జట్టు ఇంగ్లాండ్‌కు గట్టిపోటీ ఇచ్చింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కెప్టెన్‌ స్మృతి మంధనా మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభం కలిసి రాలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్‌ ఆన్య ష్రుబ్‌సొలే నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాట్స్‌ఉమెన్స్‌లపై విరుచుకుపడింది. ఈమే ధాటికి దూకుడుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత సారథి స్మృతి మంధనా 15 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసి ఆన్య బౌలింగ్‌లో కీపర్‌ సారాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో 27 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత మరో రెండు పరుగుల వ్యవధిలోనే మెఘన (1)ను కూడా ఆన్య పెవిలియన్‌కి పంపి భారత్‌కు పెద్ద షాకిచ్చింది. అనంతరం మరో ఓపెనర్‌ ప్రియా పూణియా, హర్లీన్‌ డియోల్‌ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కుదురుగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. పూణియా సమనయంతో ఆడినా మెఘన మాత్రం వేగంగా ఆడుతూ వరుస బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లపై ఎదరుదాడికి దిగింది. ఈక్రమంలోనే భారత్‌ లెవన్‌ 9.3 ఓవర్లలో 50 పరుగుల మార్కును పూర్తి చేసుకుంది. ఆ కొద్ది సేపటికే దూకుడుగా ఆడుతున్న హర్లీన్‌ (21; 29 బంతుల్లో 4 ఫోర్ల) రనౌట్‌గా వెనుదిరిగింది. ఆ వెంటనే ఓపెనర్‌ పూణియా (15) కూడా ఔటవడంతో భారత్‌ లెవన్‌ జట్టు 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత క్రీజులో అడుగుపెట్టిన సీనియర్‌ బ్యాట్స్‌వుమన్‌ వేధ కృష్ణమూర్తి (11) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయింది. భారతి ఫుల్మాలీ, వికెట్‌ కీపర్‌ కల్పన భారత ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కొద్దిసేపటి వరకు తమ వికెట్లను కాపాడుకుంటూ పరుగులు సాధించారు. సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే భారత్‌ లెవన్‌ స్కోరు 100 పరుగుల మైలురాయిని దాటింది. అనంతరం కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్న భారతి ఫుల్మాలీ (23; 44 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) మార్ష్‌ బౌలింగ్‌లో పెవిలిన్‌ చేరింది. దీంతో భారత్‌ 104 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. అదే స్కోరు వద్ద సమన్వయంతో ఆడుతున్న కల్పన (10) కూడా పెవిలియన్‌ చేరింది. చివర్లో మిన్నుమానీ (28; 57 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేస్తూ భారత స్కోరుబోర్డును 150 పరుగులు దాటించి చివరి వికెట్‌గా పెవిలియన్‌ చేరింది. దీంతో భారత్‌ లెవన్‌ జట్టు 49 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఆన్య ష్రుబ్‌సొలే నాలుగు వికెట్లు పడగొట్టగా.. జార్జియా ఎల్వీస్‌ రెండు వికెట్లు దక్కించుకుంది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌వుమెన్స్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపెట్టారు. జట్టు స్కోరు 2 పరుగుల వద్దే ఓపెనర్‌ తమ్సిన్‌ బియోమొంట్‌ (0)ను కోమల్‌ జన్జద్‌ ఎల్బీడబ్ల్యూగా పెవలియన్‌ పంపింది. మరో రెండు పరుగుల వ్యవధిలోనే మరో ఓపెనర్‌ అమీ జోనెస్‌ (2)ను రీమలక్ష్మి ఎక్క ఔట్‌ చేసింది. తర్వాత మరింతగా పుంజుకున్న కోమల్‌ నిప్పు లు చెరిగే బంతులతో బ్రిటిష్‌ బ్యాటర్లను హడలెత్తించింది. ఈమె ధాటికి ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ సారా టేలర్‌ (2) ఎల్బీ కాగా.. నటాలీ స్కైవెర్‌ (0) ఖాతా తెరువకుండానే క్లీన్‌ బౌల్డ్‌ అయిం ది. దీంతో ఇంగ్లాండ్‌ 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఈ సమయంలో హేదర్‌ నైట్‌, డానియల్‌ వ్యాట్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు కీలకమైన భాగస్వామ్యాన్ని ఏర్పర్చుతూ ముందుకు సాగారు. సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ పోవడంతో స్కోరుబోర్డు కూడా నెమ్మదిగా లక్ష్యంవైపు ప్రయాణించింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ 50 పరుగలు మార్కును పూర్తి చేసుకుంది. తర్వాత కుదురుగా ఆడుతున్న డానియల్‌ (49 బంతుల్లో 22) పరుగులు చేసి ఆవుటైంది. దీంతో 49 పరుగుల ఐదో వికెట్‌ కీలక భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం పుంజుకున్న భారత బౌలర్లు తిరిగి బ్యాట్స్‌వుమెన్స్‌ ఎదురుదాడికి దిగారు. దీతో జార్జియా ఎల్వీస్‌ (13), బ్రంట్‌ (0) తక్కువ స్కోరుకే పెవిలియ్‌ చేరడంతో ఇంగ్లాండ్‌ 79 పరుగులకే 7 వికెట్లను చేజార్చుకుంది. ఈ సమయంలో భారత్‌ విజయం ఖాయమనుకున్న సమయంలో ఆన్య ష్రుబ్‌సొలే ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో తమ జట్టును ఆదుకుంది. బౌలింగ్‌లో విజృంభించిన ఆన్య ఇప్పడు బ్యాటింగ్‌లోనూ తన సత్తా చాటింది. హేదర్‌ నైట్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 39 పరుగులు జోడించింది. అనంతరం ఆన్య 30 బంతుల్లో 5 ఫోర్లతో 23 పరుగులు చేసి వెనుదిరిగింది. మరోవైపు కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్న హేదర్‌ 73 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించింది. అనంతరం తొమ్మిదో వికెట్‌గా క్రీజులోకి అడుగుపెట్టిన లౌరెన్‌ విన్‌ఫెల్డ్‌ కూడా చెలరేగి ఆడడంతో ఇంగ్లాండ్‌ మరో వికెట్‌ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. ధాటిగా ఆడిన లౌరెన్‌ (23 నాటౌట్‌; 22 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) పరుగులతో నాటౌగా నిలిచింది. మరోవైపు ఒంటరి పోరాటం చేస్తూ విజయంలో కీలర పాత్ర పోషించిన హేదర్‌ నైట్‌ 64 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా ఇంగ్లాండ్‌ 37.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి రెండు వికెట్ల విజయాన్ని దక్కించుకుంది. భారత బౌలర్లలో కోమల్‌ జన్జద్‌ ఏడు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టింది. ఇతర బౌలర్లలో తీమలక్ష్మి ఎక్క, తనూజ కాన్వర్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. రేణుక సింగ్‌ ఒక వికెట్‌ దక్కించుకుంది.

DO YOU LIKE THIS ARTICLE?