ప్రవీణ్‌కుమార్‌పై కేసు భావస్వేచ్ఛకు వ్యతిరేకం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్‌ :ముఖ్యమంత్రితోసహా అందరి మెప్పుపొంది, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌పై పదవీరమణ చేసిన మరుసటి రోజే కేసు పెట్టడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. అభిప్రాయాలు స్వే చ్ఛగా వెల్లడించడానికి రాజ్యాంగంలో హక్కు లు కల్పించారని, ప్రవీణ్‌కుమార్‌పై కేసు పెట్టడం కూడా భావస్వేచ్ఛకు వ్యతిరేకమైందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయనపై కేసు పెట్టడం అన్యాయమని, తక్షణమే దానిని ఉపసంహరించుకోవాలని చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
అది సభాహక్కుల ఉల్లంఘనే : మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయంలో ప్రోటోకాల్‌ పాటించకపోవడం సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అధికారపార్టీ మంత్రులు, ఎంపి, ఎంఎల్‌ఎలకు ఉన్న విధంగానే ప్రతిపక్ష పార్టీల ఎంపిలు, ఎంఎల్‌ఎలకు వారి నియోజకవర్గాల పరిధిలో ప్రోటోకాల్‌ ఉంటుందని తెలిపారు. అలా మంత్రులు పాటించకపోతే సహచర శాసనసభ్యున్ని అవమనపర్చడమే అవుతుందని, దీనిని సిపిఐ నిర్ద్వందంగా ఖండిస్తున్నదని పేర్కొన్నారు. ఇలాంటి పద్ధతులకు మంత్రులు, ప్రభుత్వం స్వస్తి చెప్పాలని, చట్టసభల సభ్యుల ఔన్నత్యాన్ని పెంచాలని చాడ విజ్ఞప్తి చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?