ప్రభుత్వ వైఫల్యామా.. ప్రధాని బాధ్యత వహిస్తారా?

‘గుజరాత్‌’లో కరోనా మరణాలపై మంత్రి ఈటల రాజేందర్‌ నిలదీత
‘కరోనా’ కంటే ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలను పడగొట్టే కుట్రలు
వైరస్‌పై కేంద్రం తాత్సారం
50 వెంటిలేటర్ల బిచ్చమిచ్చారు
శవాలమీద పేలాలు ఏరుకుంటున్న బిజెపి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ కరోనా వైరస్‌తో గుజరాత్‌లో 1600 పైచిలుకు మరణాలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా..? లేదా ఆ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి మోడీ బాధ్యత వహిస్తారా..? అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. ఐసిఎంఆర్‌ ఎన్ని సార్లు కుప్పిగంతులు వేసిందో, ఎన్నిసార్లు మార్గదర్శకాలు మార్చిందో, ఎన్నిసార్లు అయోమయానికి గురిచేసిందో ఒక సారి తెలుసుకోవాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా, బిజెపి నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఒక జాతీయ, ఢిల్లీ స్థాయి నాయకుడు కాదు కదా, కనీసం గల్లీస్థాయి నేత లు కూడా ఇలా చిల్లరగా మాట్లాడరని, ఇది సంస్కారహీనమన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో పార్లమెంట్‌ సమావేశాలను కొనసాగించారని, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు కుట్రలు చేసిందని ఆరోపించారు. కరోనా విషయంలో తాత్సారం చేశారని, నిమ్మకు నీరేత్తినట్టుగా వ్య వహరించారని బిజెపి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. బిజెపికి శవాల మీద పేలాలు ఏరుకోవడం కావాలన్నారు. ఇతరులపై నిందలు, ఆరోపణలు చేసే మందు రాష్ట్రానికి ఏం చేశారో, వారి బాధ్యత ఏమిటో ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రాంతీయ పార్టీలపై బిజెపి ఆరోపణలు చేసే ముందు తమ పాలిత రాష్ట్రాల్లో పనితీరు ఎలా ఉన్నదో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఒక సారి యుపి,గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు పోయి అక్కడి పరిస్థితిని చూద్దామా అని ప్రశ్నించారు. బిజె పి అధికారంలోనికి వస్తే దేశం కూడా మరో గుజరాత్‌ రాష్ట్రం అవుతుందని, అలాగే అభివృద్ధి చెందుతుందని గవర్నర్లు, ఆర్థిక నిపుణులు అంద రూ అనుకన్నారని, కానీ అలా జరగలేదన్నారు. 17వేల బెడ్లలో ప్రస్తుతం 6 శాతం మాత్రమే ఆక్యూపెన్సీలో ఉన్నదన్నారు. వెయ్యి వెంటిలేటర్లను కా వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తే బిక్షంగా 50 మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. కేవలం రెండు లక్షల ఎన్‌95 మాస్కులు ఇచ్చారని, రోజూ 4500 నుండి 5వేల కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే యం త్రాన్ని తాము ఆర్డర్‌ చేస్తే దానిని కలకత్తాకు తరలించారని, తెలంగాణ రాష్ట్రానికి సహకారం అందించకపోగా తాము ఆర్డర్‌ ఇచ్చిన యంత్రాన్ని ఇతర రాష్ట్రానికి ఎలా తరలిస్తారనే విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ని, ఐసిఎంఆర్‌ భార్గవ్‌తో కూడా తానే మాట్లాడినట్టు వివరించారు. తమ ప్ర జలను కాపాడుకునే విషయంలో తమకు ఎవరి దయదాక్షిణ్యాలు అవస రం లేదని, తమకు ఆ సత్తా ఉన్నదన్నారు. కరోనా వైరస్‌తో రాష్ట్రంలో 203 మంది మరణిస్తే దేశంలో 13వేల మంది మరణించారని చెప్పారు. 50వేల మందికి పరీక్షలు నిర్వహించగా 7072 వరకు పాజిటివ్‌ వచ్చిందని మం త్రి వివరించారు. కరోనా వైరస్‌ పెరుగుతుందని, కేంద్రం పట్టించుకోవడం లేదని,మరో అమెరికా, ఇటలీ అవుతుందని అని సిఎం కెసిఆర్‌ కేంద్రాన్ని అప్రమత్తం చేశారన్నారు. కంటైన్‌మెంట్‌ అనే పదానికి అర్థం చెప్పిన రాష్ట్రం తెలంగాణ అని, దీనితోనే దేశం అప్రమత్తమైందని చెప్పారు. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు మొదలు కాకముందే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని చర్యలు ప్రారంభించిందని వివరించారు. ఇదిలా ఉండగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లోని ఆయన విగ్రహం వద్ద మంత్రి ఈటల రాజేందర్‌ నివాళ్లు అర్పించారు.

DO YOU LIKE THIS ARTICLE?