ప్రభుత్వానికే వదిలేయాలి: కపిల్‌దేవ్‌

పుణె : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరగాలా వద్ద అన్న ప్రశ్నపై భారత మాజీ క్రికెటర్‌ కపీల్‌ దేవ్‌ తాజాగా స్పందించారు. శుక్రవారం పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భారత దిగ్గజం కపిల్‌ దేవ్‌ ఈ అంశంపై మాట్లాడారు. వచ్చే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో ఆడాలా? వద్దా? అనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికే వదిలేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఇది సున్నితమైన అంశం. దీనిపై తమ అభిప్రాయాలు చెప్పడం సరికాదని ఆయను అన్నారు. దాయాదితో ఆడాలో వద్దో అనేది మనలాంటి వాళ్లు నిర్ణయించే అంశం కాదు. కేంద్ర ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాలి. దీనిపై మన సొంత అభిప్రాయాలు చెప్పకపోవడమే ఉత్తమం భారత ప్రభుత్వం, సంబంధిత వర్గాలపై ఈ నిర్ణయాన్ని వదిలేయాలి. దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే వారి నిర్ణయం ఉంటుంది. అని కపిల్‌ దేవ్‌ అన్నారు. మరోవైపు పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడాలా వద్ద అన్న అంశంపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కపిల్‌దేవ్‌ కంటే ముందు భారత మాజీలు సునీల్‌ గవాస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌లు కూడా ఈ ఆంశంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఈ ఇద్దరూ కూడాపాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించే బదులు ఆడి ఆ జట్టును ఓడించడం మంచిదని అభిప్రాయపడ్డారు.
వారికే వదిలేశాం : కోహ్లీ
ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో ఆడాలా.. వద్దా అనే విషయాన్ని బిసిసిఐతో పాటు ప్రభుత్వానికే వదిలేశామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం విశాఖలో తొలి టీ20లో తలపడనున్న నేపథ్యంలో కోహ్లీ ప్రెస్‌ కాన్ఫిరెన్స్‌లో మాట్లాడాడు. ప్రపంచకప్‌లో పాక్‌తో ఆడటంపై భారత క్రికెట్‌ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటాం. వారు తీసుకునే నిర్ణయం ఏదైనా గౌరవిస్తాం. పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ జవాన్లకు జట్టు తరఫున ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామని అన్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?