ప్రపంచకప్‌ జట్టుపైనే అందరి ఆసక్తి

సీనియర్లకు, జూనియర్లకు మధ్య పోటీ
క్రీడా విభాగం: ఇంగ్లాండ్‌ వేదికగా ఈ ఏడాది ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. భారత తుది జట్టు కోసమే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి జట్టులో సీనియర్లకు, జూనియర్లకు మధ్య తీవ్రమైన పోటీ కనబడుతోంది. ఎవరిని ఎంపిక చేయాలో.. ఎవరిని పక్కనపెట్టాలో సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ప్రధాన జట్టుతో పాటు బెంచ్‌ స్కాడ్‌ కూడా బలంగా ఉంది. ఎవరికి అవకాశం లభించినా వారు వదలకుండా అద్భుతంగా రాణిస్తున్నారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించిన జంటగా మంచి పేరు సంపాదించారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా 25 ఓవర్ల వరకు క్రీజులో నిలిస్తే భారత్‌ భారీ స్కోరు చేయడం ఖాయం. హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ తన బలమైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తాడు. ఇతను పిచ్‌పై ఉన్నంత సేపు పరుగుల వదర పారడం ఖాయం. మరోవైపు గబ్బర్‌ సింగ్‌ కూడా వేగంగా పరుగులు చేయడంలో దిట్ట. వీరిద్దరూ భారత్‌కు ఎన్నో శుభారంభాలు అందించారు. ఇక భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత పరుగుల యంత్రం కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లో తన ఆటను మెరుగుపర్చుకుంటూ ఉంటాడు. ఒత్తిడికి లోనవకుండా ధాటిగా ఆడటం ఇతని నైజాం. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి వేగంగా పరుగులు సాధిస్తాడు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో నమోదైన ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రతి మ్యాచ్‌లో ఏదోఒక రికార్డు చెరిపేయడం ఇతని స్వభావంగా మారింది. ప్రతి ఫార్మాట్లో తనకు ఎదురులేదని నిరూపిస్తున్నాడు. కెరీర్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నాడు. భారత అండర్‌ జట్టుకు తన సారథ్యంలోనే ప్రపంచకప్‌ అందించాడు. ఇప్పుడు సీనియర్‌ విభాగంలో భారత్‌కు మరో ప్రపంచకప్‌ను అందించేందుకు సిద్ధమయ్యాడు.
ధోనీయే కీలకం..
గత ఏడాది ఘోరంగా విఫలమైన సీనియర్‌ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఇప్పుడు ఫామ్‌ను అందుకున్నాడు. ఈ సంవత్సరం ఆరంభం నుంచి మంచి ప్రదర్శనలతో తన సత్తా చాటుకున్నాడు. ఇతనికి పోటీగా యువ సంచలనం రిషభ్‌ పంత్‌ వచ్చిన ప్రపంచకప్‌ జట్టులో ఇతని స్థానం పదిలమైపోయింది. ప్రపంచకప్‌ జట్టులో ధోనీయే భారత కీలక ఆటగాడని భారత చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. ఇక భారత మాజీలే కాకుండా విదేశీ ఆటగాళ్లు సైతం ధోనీకి మద్దతుగా నిలుస్తున్నారు. టీమిండియా ప్రపంచకప్‌ గెలవాలంటే జట్టులో ధోనీ తప్పనిసరిగా ఉండాలని సలహాలు ఇస్తున్నారు. ధోనీ సారథ్యంలో భారత జట్టు రెండు ప్రపంచకప్‌లో కైవసం చేసుకుంది. వన్డే ప్రపంచకప్‌తో పాటు.. టి20 ప్రపంచకప్‌ ట్రోఫీని భారత్‌ ధోనీ కెప్టెన్సీలోనే అందుకుంది. సుదీర్ఘకాలంగా క్రికెట్‌ ఆడుతున్న ధోనీ అనుభవం చాలా విలువైంది. ధోనీ జట్టులో ఉంటే అది టీమిండియాకు అదనపు బలమని విశ్లేషకులు చేబుతున్నారు. తన అపారమైన అనుభవంతో జట్టును విజేతగా నిలపగలడని అంటున్నారు. వికెట్ల వెనుకనుంచే ఫీల్డింగ్‌ను, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌ కదలికలను ఇట్టే పసిగట్టగలడు. సెకన్ల వ్యవధిలోనే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను స్టంపింగ్‌ చేయగలడు. అందుకే ప్రపంచ దిగ్గజ వికెట్‌ కీపర్లలో ఇతనికి ప్రత్యేక స్థానం ఉంది. బ్యాట్‌తో కూడా రాణించగలడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాలను తారుమారు చేయగల సత్తా ఇతనికి ఉంది. అందుకే ప్రపంచకప్‌ జట్టులో మహేంద్ర సింగ్‌ ధోనీ పాత్ర కీలకం.
నాలుగో స్థానంలో రాయుడు..
హైదరాబాదీ స్టార్‌ అంబటి రాయుడు ప్రస్తుతం కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడాది ఐపిఎల్‌ నుంచి తన జోరును కనబర్చుతున్నాడు. తర్వాత టీమిండియాలో ఆడే అవకాశం లభించిన ప్రతిసారి గొప్ప బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఇతని ఆట అద్భుతం. చాలా కాలంగా టీమిండియాకు నాలుగో నెంబర్‌లో బ్యాటింగ్‌ చేసే బ్యాట్స్‌మెన్స్‌ కోసం అన్వేశిస్తోంది. అయితే ఈ స్థానంలో తనకు లభించిన అవకాశాలను రాయుడు పూర్తిగా సఫలమయ్యాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ తర్వాత మూడో స్థానంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌కు వస్తాడు. ఒకవేళ ఈ ముగ్గురు విఫలమైన జట్టును ఆదుకునే ఆటగాడి కోసం టీమిండియా చాలా కాలంగా పరిశీలిస్తోంది. ఈ స్థానంలో ఎందరో ఆటగాళ్లకు అవకాశాలు కలిపించింది. అందులో రాయుడు సఫలమయ్యాడు. ఇటీవలే కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రాయుడు పర్వాలేదనిపించాడు. చివరి వన్డేలో రాయుడు (90) పరుగులతో చిరస్మరణీయా ఇన్నింగ్స్‌ ఆడాడు. 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను విజయ్‌ శంకర్‌ (45)తో కలిసి ఆదుకున్నాడు. ఫలితంగా ఆ మ్యాచ్‌లో భారత్‌ 252 పరుగులు చేయగలిగింది. ఇతర మ్యాచుల్లోనూ రాణించి టీమిండియా విజయాల్లో తనవంతు సహకారం అందించాడు.
సత్తా చాటుతున్న పంత్‌, విజయ్‌ శంకర్‌
టెస్టు క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్‌ పలకడంతో అతని స్థా నంలో టెస్టు జట్టులో అవకాశం దక్కించుకున్న యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ సంచలనం సృష్టిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కంగారులను హడలెత్తించాడు. కీపింగ్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తూ.. బ్యాటింగ్‌లోనూ తన ఉనికిని చాటుకున్నాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్స్‌ విఫలమైన తాను మాత్రం ధాటిగా ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడే స్వభావం అతనిలో ఉంది. ఏ బౌలరైనా సరే బలమైన బౌండరీలు బాదగలడు. మ్యాచ్‌ను తారుమారు చేసే సత్తా ఇతనికి ఉందని, రానున్న కాలంలో భారత జట్టులో కీలక ఆటగాడి పాత్ర పోషిస్తాడని మాజీలు ఇతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచకప్‌ జట్టులో ఇతనికి అవకాశం ఇవ్వాలని భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ అన్నారు. ధోనీని వికెట్‌ కీపర్‌గా తీసుకొని పంత్‌ను బ్యాట్స్‌మన్‌గా జట్టులో ఆడించాలని సూచించారు. పంత్‌కు మంచి భవిషత్తు ఉందిన ఆయన పేర్కొన్నారు. మరోవైపు విజయ్‌ శంకర్‌ వరుసగా మంచి ప్రదర్శనలతో జట్టులో తన స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకుంటున్నాడు. తనకు లభించిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపర్చుకొంటున్నాడు. కీలక సమయాల్లో రాణిస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. తన ప్రధాన్యతను చాటుకుంటున్నాడు. శంకర్‌ మెరుగైన ప్రదర్శనలతో ప్రపంచకప్‌ జట్టులో తన స్థానాన్ని దాదాపు బర్తి చేసుకున్నాడనే చెప్పాలి.
రహానే, రాహుల్‌ డౌటే..!
ప్రపంచకప్‌ జట్టులో అజింక్యా రహానే, కెఎల్‌. రాహుల్‌ స్థానాలు డౌటే. వీరి అంచనాలకు తగ్గట్టు రాణించలేక పోతున్నారు. చాలా అవకాశాలు లభించిన తమ సత్తా చాటలేక పోయారు. ఈసారి రహానేకి స్కాడ్‌లో చోటు లభించే అవకాశాలు అంతంత మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఇంగ్లాండ్‌ గడ్డపై రాణించగల సత్తా ఉండడం ఇతనికి ప్లస్‌ పాయింట్‌కావచ్చు. మరోవైపు రాహుల్‌ ఆస్ట్రేలియా సిరీస్‌లో వరుసగా విఫలమయ్యాడు. తర్వాత నుంచి ఇతనికి తుది జట్టులో చోటు లభించలేదు.
ప్రస్తుతం భారత్‌ జట్టు తరఫున రాణిస్తున్నాడు. కానీ ప్రపంచకప్‌ జట్టులో ఇతని స్థానం గురించి కచ్చితంగా చెప్పాలేము.

DO YOU LIKE THIS ARTICLE?