ప్రధాని పదవిపై ఆసక్తి లేదు

సర్పంచ్‌ స్థాయికి దిగజారి మాట్లాడుతున్న మోడీ
త్వరలో కొత్త రెవెన్యూ చట్టం
వరంగల్‌ ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌
వరంగల్‌ బ్యూరో : ప్రధానమంత్రి కావాలనే ఆసక్తి తనకు ఏ మాత్రం లేదని, ఎన్నికల్లో ప్రజల అభిమతం గెలవాలన్నదే తన ఆకాంక్ష అని టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రమైన వరంగల్‌లోని అజంజాహిమిల్లు గ్రౌండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రాల హక్కులను, అధికారాలను కేంద్రం లాగేసుకుంటోందని, కేంద్రంలో ప్రాంతీయ పార్టీ ల పెత్తనం రావాలని అన్నారు. ఎస్‌సి వర్గీకరణపై నాలుగు సార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, అయినా కేంద్రం చేయలేదని ఆరోపించా రు. వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలంటే ఫెడరల్‌ ఫ్రంట్‌ రావాల్సిందేనన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌, బిజెపియేతర ప్రభుత్వం ఏర్పడడం తథ్యమని చెప్పారు. ప్రధానమంత్రి మోడీ సర్పంచ్‌ స్థాయికి దిగజారి మాట్లాడడం బాధాకరమని, ఆయన మాట్లాడిన తీరుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ డిమాండ్‌ చేశారు. చైతన్యవంతమైన వరంగల్‌ జిల్లా నుండి స్ఫూర్తివంతమైన తీర్పును ఆశిస్తున్నామన్నారు. ఓరుగల్లుకు కొత్తగా నేర్పాల్సిన పాఠా లు ఏమీ లేవని, ఉద్యమ కాలం నుండి నేటి ఎన్నికల వరకు ప్రజలెప్పుడూ తనను చిన్నచూపు చూడలేదన్నారు. పార్లమెంట్‌కు జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ప్రశాంతంగా ఆలోచించి తెలంగాణకు ఏది మేలైతే దానివైపే నిర్ణయం తీసుకోవాలన్నారు. దేశంలో ఇప్పటి వరకు రెండు పార్టీలే ఏలుతున్నాయని, 73 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌, బిజెపి మధ్యలో జనతా పార్టీలు కలిసి పరిపాలించాయని, ఈ రెండు పార్టీలు నేటి వరకు ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లనే ఒకరిపై ఒకరు నిందలు వేసుకొని విమర్శలు చేసుకోవడం తప్ప దేశం గురించి, ప్రజల అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచించలేదన్నారు. దేశంలో అపారమైన సంపద ఉన్నప్పటికీ దాన్ని వినియోగించడంలో కాంగ్రెస్‌, బిజెపి ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. 70 వేల టిఎంసిల నీరు దేశంలో అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ నీటిని అన్ని రాష్ట్రాల ప్రజలకు పంపిణీ చేసి సరైన దిశలో వినియోగంలోకి తీసుకువచ్చే పని ఇప్పటి వరకు చేయలేదన్నారు. మూడు లక్షల 40 వేల మెగావాట్ల విద్యుత్‌ దేశంలో ఉత్పత్తి అవుతున్నా దేశంలోని సగం రాష్ట్రాలు చీకట్లోనే గడుపుతున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా కరెంటు కోతలతో కూడిన విద్యుత్‌ సరఫరా ఉందని, దాని ఫలితంగా ఆ రాష్ట్రం కూడా చీకట్లోనే మగ్గుతోందన్నారు. దేశంలో పేరుకుపోయిన పేదరికం, నిరుద్యోగం, రైతు గిట్టుబాటు ధర లాంటి సమస్యలు నేటికీ పరిష్కారం కావడం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నుండి రూ.35 వేల కోట్లు ఇచ్చామని మోడీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఒకరిస్తే తీసుకోవాల్సిన ఆగత్యం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రమే ధనిక రాష్ట్రమని, దేశంలోని ఆరు ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ ధనిక రాష్ట్రంగా ప్రపంచ పటంలో నిలిచిందన్నారు. అలాంటి రాష్ట్రానికి కేంద్రం ముష్ఠి వేసినట్లు రూ.35 వేల కోట్లు ఇచ్చామని నరేంద్రమోడీ చెప్పడమే సిగ్గు చేటని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి ఏటా రూ.లక్ష కోట్లు చెల్లిస్తే రాష్ట్రానికి వారిచ్చేది కేవలం రూ.24 వేల కోట్లేనని చెప్పారు.
త్వరలో కొత్త రెవెన్యూ చట్టం
దేశంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటిని పంపిణీ చేయడంలో కేంద్ర పాలకులు వైఫల్యం చెందారని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం వల్ల రైతు పండించిన పంట నష్టపోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకొని రైతును ఆదుకుంటున్నామన్నారు. రైతును ఆర్థికంగా పరిపుష్టి చేయడం కోసం రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలు ప్రవేశపెట్టామన్నారు. భూ సమస్యలు లేకుండా ఉండడం కోసం భూ ప్రక్షాళన కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపట్టామని చెప్పారు. భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ చట్టంలో కొన్ని సవరణలు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తామన్నారు. ఎన్నికల తరువాత ఈ చట్టం అమల్లోకి వస్తుందన్నారు. రైతులకు సంబంధించిన పట్టాపాస్‌ పుస్తకాల జారీలో అధికారులకు రైతులు ఎవరు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల వరకు ఓపిక పట్టుకుంటే ప్రతిఒక్కరికి లంచం లేకుండా నేరుగా రైతు ఇంటికే పట్టాపాస్‌పుస్తకాలు నడుచుకుంటూ వచ్చేలా చేస్తామన్నారు. ఈ సమావేశానికి మాజీ డిప్యూడీ సిఎం కడియం శ్రీహరి అధ్యక్షత వహించగా పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మికాంతారావు, ఎంఎల్‌ఎలు నన్నపునేని నరేందర్‌, ఆరూరి రమేష్‌, దాస్యం వినయ్‌భాస్కర్‌, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, కార్పొరేషన్‌ చైర్మున్లు నాగూర్ల వెంకటేశ్వర్లు, వాసుదేవరెడ్డి, రాజయ్యయాదవ్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?