ప్రతి గ్రామంలో హరితహారం నర్సరీ

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ప్రతి గ్రామ పంచాయతీ పేరుపై హరితహారం నర్సరీ ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. జూలైలో నిర్వహించబోయే హరితహారంపై సచివాలయంలో గురువారం అన్ని జిల్లా లు, మండల స్థాయి అటవీ, వ్యవసాయ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏ గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని ఆ గ్రామం పేరుతో హరితహారం నర్సరీగా పిలవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. ఏ శాఖ నర్సరీని నిర్వహిస్తు న్నా.. పేరు మాత్రం గ్రామ పంచాయతీ పేరుపైనే ఉండాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. రోడ్లకు ఇరువైపులా ఈ ఏడాది పెద్ద ఎత్తున చింత చెట్లు నాటాలని నిర్ణయించారన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 15 నుంచి 20 కిలోమీటర్ల మేర తొలిదశలోనే చింత చెట్లను నాటాలని చెప్పారు. ఆగ్రో ఫారెస్ట్రీ క్రింద గంధం, వెదురు, టేకు, సరుగుడు మొక్కల పెంపకాన్ని చేపట్టి చిన్న, సన్నకారు రైతులకు అదనపు ఆదాయం ఉండేలా ప్రోత్సహించాలన్నారు. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా మాట్లాడుతూ జిల్లాల వారీగా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు సమావేశమై అయిదవ విడత హరితహారంపై కార్చాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. గ్రామస్థాయిలో నర్సరీల ఏర్పాటు, ఉపాధి హామీ నిధులతో అనుసంధానం, ఆగ్రో ఫారెస్ట్రీకి ప్రోత్సాహం వంటి వాటిపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్లు రాహూల్‌ బొజ్జా, నీతూ ప్రసాద్‌, పిసిసిఎఫ్‌ పికె.ఘూ, సిఎం ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?