పేలిన బాయిలర్‌

నలుగురు మృతి..
పలువురికి తీవ్ర గాయాలు
ఖమ్మం జిల్లాలోని సీడ్స్‌ కంపెనీలో ఘోర ప్రమాదం
పేలుడు శబ్ధానికి కార్లు ధ్వంసం

ప్రజాపక్షం/పెనుబల్లి : బాయిలర్‌ పేలి నలుగురి ప్రాణాలను బలిగొంది. ఇంకా ఎంత మంది మృతిచెందారన్నది ఇంకా తేలలేదు. బాయిలర్‌ పేలుడు శబ్ధానికి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని నాయకలగూడెం వద్ద సాయి సంజూస్‌ సీడ్స్‌ పేరుతో మొక్కజొన్నల ఫ్యాక్టరీని స్థాపించారు. ఈ కర్మాగారంలో మొక్కజొన్న కంకి నుంచి మొక్కజొన్నలను వేరుచేస్తారు. సత్తుపల్లికి చెందిన ఓ వ్యక్తి ఈ ఫ్యాక్టరీని నెలకొ ల్పారు. అక్కడ ఉన్న ఒక్క బాయిలర్‌కు అదనంగా మరో రెండు బాయిలర్లను బిగించే ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్న క్రమంలో బాయిలర్లు పేలడంతో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు. 50 మం ది కూలీలు గాయపడినట్లు సమాచారం. ముగ్గురు మృతదేహాలను వెలికి తీశారు. మరో మృతదేహం శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం. పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో ఎంత మంది ఉన్నారనేది ఇదిమిద్దంగా తెలియలేదు. మృతిచెందిన వారు బీహార్‌కు చెందిన వలస కూలీలుగా చెబుతున్నారు. వలస కూలీలతో పాటు అగ్రహారం, నాయకలగూడెం, బయ్యన్నగూడెం గ్రామాలకు చెందిన కార్మికులు కూడా పనిచేస్తున్నారు. క్షతగాత్రులను కల్లూరు, పెనుబల్లి ఆసుపత్రులకు తరలించారు. ఫ్యాక్టరీలో విద్యుత్తు లేకపోవడంతో ప్రమాదాన్ని గుర్తించడం కష్టంగా ఉంది. పేలుడు సమయంలో ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న కార్లు సైతం ధ్వంసమయ్యాయి. సంఘటన స్థలాన్ని ఎసిపి ఆంజనేయులు, ఆర్‌డిఒ శివాజీ, రూరల్‌ సిఐ రవికుమార్‌, ఎస్‌ఐ నాగరాజులు పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?