పెరూ అధ్యక్షునిగా

పెడ్రో కాస్టిల్లో ఎన్నిక ధ్రువీకరణ
జులై 28న పదవీ స్వీకారం
లిమా : పెరూ అధ్యక్ష ఎన్నికల ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయింది. మార్కిస్టు పెడ్రో కాస్టిల్లో ఈ లాటిన్‌ అమెరికా దేశ అధ్యక్షునిగా ఈనెల 28న పదవీ ప్రమాణం స్వీకరిస్తారు. ఆయన ఎన్నికపై మితవాద ప్రత్యర్థి శ్రీమతి కీకో ఫుజిమోరి లేవనెత్తిన లీగల్‌ అభ్యంతరాలన్నిటినీ జాతీయ ఎన్నికల సంస్థ త్రోసిపుచ్చింది. జూన్‌ 6న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కాస్టిల్లో 44వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తన ఓటమిని అంగీకరించని ఫుజిమోరి ఎన్నిక రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేశారు. అమెరికా వ్యాపారవేత్తలు ఆమెకు పూర్తి మద్దతు ఇచ్చారు. వామపక్ష అధ్యక్షుడిపట్ల తమకు సుముఖత లేదని పెరూ సైనికాధికారలు కూడా సూచన ప్రాయంగా తెలియజేశారు. అయితే గ్రామీణ రైతులు, పట్టణ పేదలతో కూడిన కాస్టిల్లో మద్దతుదారులు వేలాదిమంది వీధుల్లోకి వచ్చి కాస్టిల్లో ఎన్నిక ఫలితాన్ని అధికారికంగా ప్రకటించాలని ఎన్నికల జాతీయ జ్యూరీని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సంఘం ప్రకటించిన నిర్ణయాన్ని ఫుజిమోరి అంతిమంగా ఆమోదించటంపట్ల కాస్టిల్లో హర్షం వ్యక్తం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?