పెరుగుతున్న కరోనా..

తెలంగాణలో మరో 3 పాజిటివ్‌ కేసులు
రాష్ట్రంలో 36కి చేరిన కరోనా కేసుల సంఖ్య
విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు
హైదరాబాద్‌ : తెలంగాణలో మరో 3 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 34వ పేషెంట్‌ లండన్‌ నుండి రంగారెడ్డి జిల్లా కోకాపేటకు వచ్చిన 49 ఏళ్ల పురుషుడుగా వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇతను కొద్ది రోజుల క్రితం లండన్‌ నుంచి తెలంగాణకు వచ్చినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఇతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పేర్కొన్నది. 35వ కరోనా పాజిటివ్‌ కేసు జర్మనీ నుంచి రంగారెడ్డి జిల్లా చందానగర్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ అని తెలిపింది. ఈమె ఇటీవల జర్మనీ నుంచి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. మరో వ్యక్తి సౌదీ అరేబియా వెళ్లొచ్చిన బేగంపేటకు చెందిన 61 ఏళ్ల మహిళకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ మంగళవారం 12 గంటల బులిటన్‌లో పేర్కొన్నది. ఈమే ఇటీవలే సౌదీ అరెబియా నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురినీ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం(ఈనెల 23) ఒక్క రోజే 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదై కేసుల సంఖ్య 33కు చేరగా తాజాగా మంగళవారం మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 36కు చేరింది. రాష్ట్రంలో వేగంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమై ఎప్పటికప్పుడు నివారణ చర్యలను చేపడుతోంది. ఇందులోభాగంగానే ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసింది. దీంతోపాటు ఇంటింటి సర్వేను కూడా నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి దానికనుగుణంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?