పెట్రో ధరలు మళ్లీ పెరిగాయ్‌

వరుసగా 9వ రోజు పెరుగుదల
న్యూఢిల్లీ : చమురు ధరలు విశ్వవ్యాప్తంగా తగ్గుతున్నప్పకీ, భారత్‌లో మాత్రం పెట్రో ధరలు మంటెక్కుతున్నాయి. తాజాగా మరోసారి పె ట్రోల్‌, డీజిల్‌ ధరలను కంపెనీలు పెం చాయి. పెట్రో ధరలను పెంచడం వరుసగా ఇది 9వ రోజు. సోమవారం నాడు పెట్రోల్‌ ధరలను లీటరుకు 48 పైసలు, డీజిల్‌ను లీటర్‌కు 23 పైసలను పెంచుతున్నట్లు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. రేటు సవరణకు 82 రోజులపాటు విరామమిచ్చిన తర్వాత వరుసగా తొమ్మిది రోజులు పెట్రో ధరలను పెంచుకుంటూ పోవడం వినియోగదారులను దెబ్బతీస్తోంది. తాజాగా పెరిగిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటరు రూ. 75.78 నుంచి రూ. 76.26కి పెరిగింది. అలాగే డీజిల్‌ ధర లీటరు రూ. 74.03 నుంచి రూ.74.26కి పెరిగిందని ప్రభుత్వ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల ధరల నోటిఫికేషన్‌ వెల్లడించింది. స్థానిక సేల్స్‌ ట్యాక్స్‌, వ్యాట్‌ల ఆధారంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రో ధరల పెరుగుదల భిన్నరీతుల్లో వుంటుందని పేర్కొంది. పదేపదే పెట్రో ధరలను పెంచడం పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్‌గాంధీ తీవ్రంగా విమర్శించారు. పెట్రో ధరలను కావాలనే ప్రభుత్వం పెంచుకుంటూ పోతున్నదని, కరోనా వేళ ఇది సరైన నిర్ణయం కాదని అన్నారు.
సిపిఐ ఖండన : పెట్రో ధరల పెంపును సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గిపోతుంటే మన దేశంలో ధరలు పెంచడమేమిటని ప్రశ్నించారు. జూమ్‌ ద్వారా సోమవా రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బిజెపి అధికారంలోకి వచ్చాక 2014లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు ఉన్నదని , ఇప్పుడు 40 డాలర్లకంటే దిగువకు పడిపోయిందన్నారు. అయినా పెట్రోలు ధరలు మాత్రం రూ.80కి చేరిందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయంగా ధరలు తగ్గినా, పెట్రో ధరలను పెంచడం ద్వారా రూ.7 లక్షల కోట్లు ప్రజల నుండి వసూలయ్యాయని, ఆ మొత్తం ఎక్కడికి పోయిందని నిలదీశారు. కేవలం ప్రైవేటు పెట్రోలు కంపెనీలకు లాభం కల్పించేందుకే పెట్రో ధరలను పెంచుతున్నారని, ఈ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. ఒకవైపు ప్రజలు కరోనాతో బాధపడుతుంటూ, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు పెట్రో ధరలు పెంచి ప్రభుత్వాలు లూటీ చేస్తున్నాయని నారాయణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ధర పెంచగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెంచేశాయని అన్నారు. దీనిపై మంగళవారం జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో జరిగే సిపిఐ జాతీయ కార్యవర్గంలో చర్చించి సమరశీల పోరాటానికి పిలుపునిస్తామన్నారు. ఒకవైపు కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే కేంద్ర హోం మంత్రి మాత్రం బిహార్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని నారాయణ విమర్శించారు. వర్చువల్‌ ప్రచారం పేరుతో 72వేల బూత్‌ కమిటీలకు టివిలు ఇప్పించారని, అందుకు రూ.150 కోట్లు ఖర్చయిందన్నారు. దేశంలో కెలా బిహార్‌ నుండే ఎక్కువ మంది వలస కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తారని, లాక్‌డౌన్‌లో వారిని ఆదుకునేందుకు మనసు రాని బిజెపి నేతలు ప్రచారానికి మాత్రం రూ.150 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఇప్పటికైనా బిహార్‌ ప్రజలు వాళ్ళ అసలు రంగును గుర్తించి ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో అలోచించుకోవాలని నారాయణ సూచించారు.

DO YOU LIKE THIS ARTICLE?