పెండింగ్‌ ప్రాజెక్టుల వద్దనే నిరసన దీక్షలు చేస్తాం

2న కృషానది, 6న గోదావరి పెండింగ్‌ ప్రాజెక్టుల వద్ద ఆందోళన
టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటన

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : కృష్ణా నదిపై పెండింగ్‌ ప్రాజెక్టులను ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈనెల 2వ తేదీన కృష్ణా పెండింగ్‌ ప్రాజెక్టుల వద్ద నిరసన దీక్షలు చేయనున్నట్లు టిపిసిసి అధ్యక్షులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అలాగే జూన్‌ 6న గోదావరి పెండింగ్‌ ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్‌ నేతలు దీక్షలు చేపడతారని తెలిపారు. సిఎం కెసిఆర్‌ ప్రకటించింది నియంత్రిత వ్యవసాయం కాదని, నిర్బంధ వ్యవసాయమని, దీనికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ వైఫల్యాలపై నాలుగు కమిటీలను వేసినట్లు చెప్పారు. గాంధీభవన్‌లో పెండింగ్‌ ప్రాజెక్టులు, రైతు సమస్యలపై పోరాట కార్యాచరణపై శనివారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్‌, కుసుమకుమార్‌, మల్లు భట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి, వి.హనుమంతరావు, డాక్టర్‌ జి.చిన్నారెడ్డి, షబ్బీర్‌ అలీ, సి.హెచ్‌.వంశీచంద్‌రెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమావేశ నిర్ణయాలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కృష్ణా నదిపై పెండింగ్‌ ప్రాజెక్టులు ఉన్న చోట కాంగ్రెస్‌ నేతలు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిరసన దీక్షలు చేస్తారని ఆయన తెలిపారు. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ వద్ద తాను, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పాలేరు వద్ద భట్టి విక్రమార్క, సీతక్క, పొడెం వీరయ్య, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో లక్ష్మీదేవి పంపు హౌస్‌ వద్ద రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కరివెన వద్ద చిన్నారెడ్డి, ఎల్లూరు వద్ద నాగం జనార్దన్‌రెడ్డి, నెట్టెంపాడు వద్ద సంపత్‌కుమార్‌, కల్వకుర్తి వద్ద వంశీచంద్‌రెడ్డి దీక్షలో పాల్గొంటారని వివరించారు. అలాగే 6వ తేదీన గోదావరి పెండింగ్‌ ప్రాజెక్టు వద్ద దీక్షలు ఉంటాయని తెలిపారు. కెసిఆర్‌ వైఫల్యాలను ఎండగడుతూ ఈ దీక్షలు చేస్తామన్నారు. వివిధ రంగాలలో ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయనానికి కమిటీలు వేశామని, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాల కమిటీ, టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో ఉస్మానియా భూములు, విద్యపై కమిటీ, ఎఐసిసి కార్యదర్శి చిన్నారెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ విధానంపై అధ్యయన కమిటీ, కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి నేతృత్వంలో గోదావరి పెండింగ్‌ ప్రాజెక్టులపై కమిటీ వేసినట్లు తెలిపారు.
పత్తిని క్వింటా రూ.7 వేలకు కొంటారా?
కొత్త వ్యవసాయ విధానం లోప భూయిష్టంగా ఉన్నదని, రైతుల ప్రాథమిక హక్కు కాలరాసేలా ఉన్నదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కెసిఆర్‌కు పత్తి మీద ప్రేమ ఎందుకు, మొక్కజొన్నపై కక్ష ఎందుకు అని ప్రశ్నించారు. పత్తి కంపెనీల యజమానాలుపై ప్రేమతోనేనా అని రైతాంగం గుసగుసలాడుకుంటున్నారని చెప్పారు. రైతులకు పలానా విత్తనాలు అమ్మవద్దని షాపులను ఆదేశించే అధికారం జిల్లా కలెక్టర్‌లకు ఎవరిచ్చారని, ఏ చట్టం కింద ఇచ్చారని ప్రశ్నించారు. కెసిఆర్‌ తుగ్లక్‌ చర్యను రైతులు ఆమోదించబోరని, ఈ నెల 3,4తేదీలలో డిసిసిలు రైతులతో సంప్రదింపులు జరుపుతారని, చిన్నారెడ్డి, కోదండరెడ్డిలతో కూడిన కమిటీ సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించి కాంగ్రెస్‌ తరుపున ప్రజల ముందు ఉంచుతుందన్నారు. ప్రభుత్వం చెప్పినట్లు పత్తి పంట వేస్త క్వింటాకు రూ.7వేలకు కొంటామని ముందుగానే ప్రభుత్వం హామీ ఇస్తుందా? సన్న బియ్యానికి ఛత్తీస్‌గఢ్‌లో మాదిరిగా రూ.2500కు కొంటారా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రధానికి లేఖ
రాష్ట్రంలో సిఎం కెసిఆర్‌ ఎవరికీ చెప్పకుండా, ప్రతి వారం రూ.1000 కోట్ల నుండి రూ.1500 కోట్ల వరకు ఇష్టమొచ్చినట్లు అప్పులు తెస్తున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని మించి బడ్జెట్‌యేతర మార్గంలో కార్పొరేషన్‌ల ద్వారా ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెస్తున్నారని అన్నారు. ఇవన్నింటిపై అధ్యయనం చేయాలని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్కను కోరామని, త్వరలోనే ఆర్థిక స్థితిపై ప్రధానమంత్రి,కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తామన్నారు.
మంత్రి, టిఆర్‌ఎస్‌నేతలకు ప్రైవేటు వర్సిటీలా?
ఒక క్యాబినెట్‌ మంత్రి, టిఆర్‌ఎస్‌ నేతలకు ప్రైవేట్‌ యూనివర్సిటీల అనుమతినివ్వడానికి సిగ్గు శరం లేదా అని ప్రభుత్వంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతించడం ద్వారా కెసిఆర్‌ హయాంలో ఉన్నత విద్య విఫలమైందని అంగీకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రైవేట్‌ యూనివర్సిటీలను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. బలవంతంగా తీసుకు వస్తే అందులో రిజర్వేషన్‌ లు అమలు చేయాలన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?