పీవీ.. తెలంగాణ ఠీవీ

పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం
నెలలోగా జ్ఞానభూమిలో పివి స్మారక చిహ్నం : కెసిఆర్‌
కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పివి పేరు : మోడీకి లేఖ
తెలుగు అకాడమీకి నామకరణం!
కాకతీయ వర్సిటీలో పరిశోధనా కేంద్రం

ప్రజాపక్షం / హైదరాబాద్‌: మాజీ ప్రధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి పి.వి.నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పివి జ్ఞానభూమిలో ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌రావు పివి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పివి శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. జ్ఞానభూమిలో సర్వమత ప్రార్థనలు చేశారు. పివి నరసింహారావు సమాధి వద్ద సిఎం కెసిఆర్‌తో పాటు పివి శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌, ఎంపి డాక్టర్‌ కె.కేశవరావు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం. కోదండరామ్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌, అధికార ప్రతినిధి, పివి మనుమడు ఎన్‌.వి.సుభాష్‌, పివి నరసింహారావు కుమారుడు పి.వి.ప్రభాకర్‌ రావు, కుమార్తె వాణిదేవీ, పలువురు మంత్రులు, ఎంపిలు, మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, అధికారులు, అనధికారులు పుష్పాంజలి ఘటించారు. పివిని స్మరించుకోవడానికి ఏడాది పొడవునా శతజయంతి ఉత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం కెసిఆర్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. నరసింహారావు రాజకీయ ప్రస్థానంలో కుల, ధన బలం పార్శ్యమే లేదని, కుల, ధన బలం లేకుండానే సిఎం, ప్రధాని అయిన వ్యక్తి పివి నరసింహారావు అని అన్నారు. మన్మోహన్‌ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా చేసి సంస్కరణలు తెచ్చిన వ్యక్తి పివి అని చెప్పారు. పివి తెచ్చిన సంస్కరణలు ఇప్పుడు ఫలితాలిస్తున్నాయని, మనమందరం అనుభవిస్తున్న ఆర్థిక స్వేచ్ఛకు కారణం పివినే అని సిఎం చెప్పారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చి నవభారత నిర్మాతల్లో ఒకరిగా నిలిచారని, నెహ్రుకు సమాంతర వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పివి అని కెసిఆర్‌ కొనియాడారు. అందరికీ అధికార భోగం దక్కాలని పివి అభిలషించినట్లు తెలిపారు. పివి శత జయంతి ఉత్సవాలు 51 దేశాల్లో జరుగుతున్నట్లు సిఎం వెల్లడించారు. పివికి చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారని, ఉత్సవ కమిటీలో తాము కూడా ఉంటామని విదేశాల నుంచి ఆసక్తి చూపుతున్నారన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఉత్సవాలు ఘనంగా జరగాలని, ఉత్సవ కమిటీని సిఎం ఆదేశించారు. బిల్‌ క్లింటన్‌ సహా ప్రపంచ నేతలతో పివికి మంచి సంబంధాలుండేవని, అనేక దేశాలతో దౌత్య సంబంధాలను నెరిపారని వివరించారు. వ్యక్తిత్వ పటిమ తెలుసుకునేందుకు పివి జీవితం గైడ్‌గా నిలుస్తుందని తెలిపారు. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి కలిగిన గొప్ప వ్యక్తి అని, అనుకున్నదే తడవుగా ఏదైనా నేర్చుకునే నిరంతర విద్యార్థి అని, సహాయకులున్నా స్వయంగా కంప్యూటర్‌ ఆపరేట్‌ చేసిన వ్యక్తి పివి అని కెసిఆర్‌ కొనియాడారు. నిరంతర విద్యార్థి, అధ్యయనశీలి, సామాజిక దృక్పథం గల వ్యక్తి, విజ్ఞాన సముపార్జన చేసి ఆ వెలుతురు ప్రపంచానికి అందించారని సిఎం అన్నారు. ‘వేయి పడగలు’ నవలను హిందీలోకి తర్జుమా చేయడంలో నవలను అనువాదం కాకుండా అనుసృజన చేశారన్నారు. పివి జయంతి ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని సిఎం పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది ఉత్సవాల ముగింపు సభ లక్ష మందితో జరగాలని కోరుకుంటున్నట్లు సిఎం తెలిపారు.
నెలలోగా జ్ఞానభూమిలో స్మారకం ఏర్పాటు : కెసిఆర్‌
రామేశ్వరంలో అబ్దుల్‌ కలామ్‌ స్మారకం మాదిరిగా పివి జ్ఞాన భూమిలో పివి స్మారకం ఏర్పాటు చేస్తామని సిఎం కెసిఆర్‌ చెప్పారు. జులై 28లోగా పివి స్మారకం ఏర్పాటు కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు కోరితే తెలుగు అకాడమీకి పివి పేరు పెడతామని సిఎం అన్నారు. పివి పేరుతో కాకతీయ వర్సిటీలో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పివి రచనలు పునఃముద్రణ జరగాలని, పివి రచనలు వంద శాతం సాహిత్య అకాడమీ ద్వారా ముద్రిస్తామని చెప్పారు. పలు ప్రభుత్వ కార్యక్రమాలకు పివి పేరు పెట్టాలని కెసిఆర్‌ కోరారు. పివి పేరుతో పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతామని సిఎం చెప్పారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సియు)కు పివి పేరు పెట్టాలని డాక్టర్‌ కేశవరావు సూచించారు. ఇందుకు సిఎం కెసిఆర్‌ స్పందిస్తూ హెచ్‌సియుకు పివి నామకరణం చేసే విషయమై ప్రధానికి లేఖ రాస్తామని చెప్పారు. పివి కుమారుడు ప్రభాకర్‌రావు మాట్లాడుతూ సైన్స్‌, టెక్నాలజీ అంటే పి.వి.నరసింహారావుకు చాలా ఇష్టమని, అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మహనీయుడు పివి నరసింహారావు అన్నారు. ఆయన ఎప్పుడు తాను సాధించిన విజయాల గురించి చెప్పేవారు కాదని, ఎవరినీ చెప్పనిచ్చే వారు కాదని, చెబుతామని ఎవరైనా అంటే వద్దని వారించే వారన్నారు. పివి శత జయంతి వేడుకలు ఆయన సాధించిన విజయాల గురించి చర్చ చేయడానికి ఉపయోగపడతాయన్నారు. మొట్ట మొదటి సారిగా ప్రణాళికాబద్ధంగా జయంతి వేడుకలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. డాక్టర్‌ కేశవరావు మాట్లాడుతూ పివి నరసింహారావు తీసుకువచ్చిన భూ సంస్కరణల వల్లనే భూమిలేని వారికి భూములు పంపిణీ చేశారన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పివి పాల్గొన్నారని, తాను చేపట్టిన ఏ పదవికైనా వన్నె తెచ్చిన మహనీయుడు పివి అని అన్నారు. పివితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 73 దేశాలలో పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు జరగడం గర్వకారణమన్నారు. పివి కుమార్తె వాణి దేవీ మాట్లాడుతూ భాషకు అందని వ్యక్తిత్వం ‘మా బాపు పివి’ది అన్నారు. శత జయంతి ఒక రాష్ట్రం చేయాల్సిన పని కాదని, ఒక దేశం చేయాల్సిన పని అన్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాడని పివి బతికి ఉన్నప్పుడు చెప్పారని, అదే విధంగా ఆయన తెలంగాణ సాధించారని, సిఎం కూడా అయ్యారన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?