పిడుగు‘పాట్లు’

బీహార్‌, యుపిలో పిడుగులు పడి 110 మంది దుర్మరణం
ఈ తరహా బీభత్సం దేశంలోనే తొలిసారి
పాట్నా : బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు వరదమయమయ్యాయి. అయి తే అనూహ్యమైన రీతిలో పిడుగులు పడి బీభత్స వాతావరణం నెలకొన్నది. కేవలం 36 గంటల వ్యవధిలో రెండు రాష్ట్రాల్లో పిడుగులు పడి ఏకంగా 110 మంది సామాన్య ప్రజలు దుర్మరణం పాలయ్యారు. మరో32 మంది తీవ్రం గా గాయపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లో కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోగా, బీహార్‌ రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పిడుగులు పడి 83 మంది మరణించారు. ఇటీవల కాలంలో మన దేశంలో ఈ తరహా విపత్తు కలగడం ఇదే మొదటిసారి అని భావిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా వున్నట్లు అధికారులు చెప్పారు. బీహార్‌ రాష్ట్రంలో గోపాల్‌గంజ్‌ జిల్లాలో అత్యధిక మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ పిడిగుపాటుకు మొత్తం 13 మంది మృతి చెందారు. అదే విధంగా నవాడ, మధుబని జిల్లాల్లో 8 మంది చొప్పున, శివన్‌, భాగల్‌పూర్‌ జిల్లాల్లో ఆరుగురు చొప్పున, తూర్పు చంపారన్‌, దర్భంగా, బంకా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, ఖగారియా, ఔరంగాబాద్‌ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, పశ్చిమ చంపారన్‌, కిషన్‌గంజ్‌, జెహానాబాద్‌, జముయి, పూర్నియా, సుపాల్‌, బక్సర్‌, కైమూర్‌ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, సమస్తిపూర్‌, షియోహార్‌, శరన్‌, సీతామర్హి, మాధేపురా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. దర్భంగాలో పిడుగుపాటుకు ముగ్గురు చిన్నారులు చనిపోయారని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి పుష్పేష్‌ కుమార్‌ చెప్పారు. మధుబాని జిల్లాలోని బల్హా గ్రామంలో పొలంలో పనిచేస్తున్న దంపతులపై పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఫుల్పారస్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఒ మహఫౌజ్‌ ఆలమ్‌ చెప్పారు. అలాగే పశ్చిమ చంపారన్‌ జిల్లాలోనూ పొలం పనులు చేస్తున్న ఇద్దరు రైతులపై పిడుగు పడినట్లు షికర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఒ కెకె గుప్తా చెప్పారు. రాష్ట్రంలో పిడుగులకు మరో 20 మందికిపైగా గాయపడ్డారని, వారిని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. పిడుగులకు పెద్ద సంఖ్యలో ఇళ్లుధ్వంసం కాగా, ఇంటి సామానులు దగ్థమయ్యాయి. పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాలవారికి ఒక్కొక్కరికీ 4 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ తెలిపారు. బీహార్‌లోని 38 జిల్లాల్లో మరో రెండు రోజులపాటు ఇదే స్థాయిలో వర్షాలు పడతాయని ఐఎండి తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?