పాలమూరుకు మంచినీళ్లు

నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి జూరాలకు నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక సిఎం అంగీకారం
సిఎం కెసిఆర్‌కు ఫోన్‌ చేసి చెప్పిన కుమారస్వామి
హైదరాబాద్‌ : ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రజలు ఈ వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి జూరాలకు రెండున్నర టిఎంసిల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌ నగర్‌ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని సిఎం కెసిఆర్‌ అభ్యర్థించారు. కెసిఆర్‌ అభ్యర్థనపై కర్ణాటక అధికారులతో చర్చించిన సిఎం కుమారస్వామి తెలంగాణకు నీరు అందివ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా ఫోన్‌ చేసి సిఎం కెసిఆర్‌కు తెలిపారు. ఇది మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రజలకు శుభవార్త అని కెసిఆర్‌ అన్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రజల తరఫున కుమారస్వామికి సిఎం కెసిఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు సిఎంలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి కెసిఆర్‌ కార్యాలయం తెలియజేసింది. నదీ జలాల కోసం రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య నిత్య ఘర్షణలు, నీటి యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అవలంబిస్తున్న దౌత్యనీతి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని సిఎం కార్యాలయం పేర్కొంది. ఇచ్చిపుచ్చుకునే విధానంతో, లివ్‌ అండ్‌ లెట్‌ లివ్‌ (బతుకు బతకనివ్వు) అనే నినాదంతో కెసిర్‌ ఇరుగు పొరుగు రాష్ట్రాలతో నెరుపుతున్న దౌత్యం ప్రాజెక్టులు సత్వరం పూర్తవడానికి, ప్రజల తాగునీరు, మంచినీటి కష్టాలు తీరడానికి ఉపయోగపడుతున్నదని తెలిపింది. తాజాగా ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా తాగునీటి అవసరాలు తీరడానికి కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి, నిండు ఎండాకాలంలో జూరాలకు 2.5 టిఎంసిల నీటిని విడుదల చేయించుకోవడం కెసిఆర్‌ అవలంభిస్తున్న సౌహార్ధ్ర వైఖరికి మచ్చుతునకగా నిలుస్తుందని సిఎంఓ పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో నిత్యం నీటి సమస్యలు. దేశ వ్యాప్తంగా చాలా చోట్ల నీళ్ల కోసం ఘర్షణ పడుతున్నారు. పంజాబ్‌ హర్యానా మధ్య వాటర్‌ వార్‌. తమిళనాడు కేరళ నడుమ ఎంతకూ ముగియని జలవివాదం. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నం. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతతో ఉండి నీటి గొడవలే లేకుండా చేసింది. సీఎం కేసీఆర్‌ ఓర్పుతో నేర్పుతో జలవివాదాలను పరిష్కరిస్తున్నారు. మహారాష్ట్రతో ఒప్పందమైనా, కర్నాటకతో మంచిమాటైనా..ప్రజల అవసరాలే పరమావధిగా, దేశానికే ఆదర్శంగా మారారు. ‘కుమారస్వామి ఇంత త్వరగా, ఇంత సానుకూలంగా స్పందించడానికి ఒక కారణం ఉందని, గతేడాది కర్ణాటక ప్రభు త్వం విజ్ఞప్తి మేరకు తుంగభద్రా జలాల్లో ఆర్‌డిఎస్‌ వాటా నుంచి ఒక టిఎంసి నీటిని కర్ణాటక వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ అవసరానికి జూరాలకు రెండున్నర టిఎంసిల నీళ్లను కర్ణాటక ఇస్తోందని, ఇలా సిఎం కెసిఆర్‌ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కర్ణాటక- తెలంగాణ మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. ఈ కారణంగానే ఇప్పుడు సిఎం కెసిఆర్‌ కోరగానే కర్ణాటక ప్రభుత్వం నీటి విడుదలకు ఒప్పుకుంది” అని సిఎంఓ కార్యాలయం తెలియజేసింది.

DO YOU LIKE THIS ARTICLE?