పార్లమెంట్‌ను కుదిపివేసిన పెగాసస్‌ గూఢచర్యం

గురువారానికి లోక్‌సభ వాయిదా
కొవిడ్‌పై రాజ్యసభలో చర్చ
న్యూఢిల్లీ: పెగాసస్‌ గూఢచర్య వివాదం మంగళవారం పార్లమెంటు కార్యక్రమాలను కుదిపివేసింది. దీనిపై సమగ్రమైన విచారణ జరగాలని, హోంమంత్రి అమిత్‌ షాను తొలగించాలని లోక్‌సభలో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. దాంతో లోక్‌సభ కార్యకలాపాలకు అంతరాయాలు, పదేపదే వాయిదాలు తప్పనిసరయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్షాలు పెగాసస్‌ అంశాన్నే లేవనెత్తాయి. దాంతో స్పీకర్‌ సభను ఒకరోజుకు వాయిదా వేశారు. ఈద్‌ సెలవు అనంతరం లోక్‌సభ గురువారం సమావేశం కానుంది. మొత్తానికి వర్షాకాల సమావేశాల్లో వరసగా రెండో రోజు కూడా ఎలాంటి శాసనపరమైన కార్యకలాపాలు జరగలేదు. ఇలా ఉంటే సోమవారం నాడు ధరల పెరుగుదల, మూడు సాగుచట్టాలు సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాలు సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. మంగళవారం కూడా గూఢచర్యం తదితర అం శాలపై ప్రతిపక్షాలు గొడవ మొదలుపెట్టడంతో సభ రెండుసార్లు వాయిదాపడింది. ఈ క్రమం లో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ సహా వివిధ ప్రతిపక్ష సభ్యులు గూఢచర్యం అంశంపై నినాదాలు, ప్లకార్డులతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 11 గంటలకు మళ్లీ సమావేశమైన తర్వా త కూడా కేవలం ఐదు నిమిషాలే సభ జరిగిం ది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైనప్పుడు కూడా ఇదే ఘట్టం పునరావృతమైంది. కాగా ప్రజలు నిరుద్యోగంతో బాధపడుతుంటే ప్రభుత్వం గూఢచర్యం అంశంపై తలమునకలైందని, పెగాసస్‌ గూఢచర్యంలో రాహుల్‌ గాంధీ లక్ష్యంగా మారారని కాంగ్రెస్‌ సభ్యులు, గూఢచర్యం కోసం అభిషేక్‌ బెనర్జీ ఫోన్‌ను ఎంచుకున్నారని తృణమూల్‌ సభ్యులు ఆరోపణలతో నినాదాలు హోరెత్తాయి. ఇక వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి లేవనెత్తారు. దీంతో సభకు ఆటంకం కలిగించవద్దని, ప్రతి అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పీకర్‌ ఓం బిర్లా సభ్యులను కోరారు. అలా పార్లమెంటు లోపలా, బయటా పెగాసస్‌ స్పైవేర్‌తో గూఢచర్యం అంశం రాజకీయ ఆయుధంగా మారిపోయింది. దీనిపై కూలంకషమైన విచారణ చేయాలని, హోంమంత్రి అమిత్‌ షాను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అయితే దీనితో తమకు సంబంధం లేదని ప్రభుత్వం పేర్కొంది. కాగా రాహుల్‌ గాంధీ, బిజెపి మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌, మాజీ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని ఒక అంతర్జాతీయ మాధ్యమ సంస్థ వెల్లడించింది.
రాజ్యసభలో…
ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్‌ఆర్‌సిపి సభ్యుల నినాదాల మధ్య రాజ్యసభ కూడా మూడోసారి వాయిదాపడింది. అయితే నిరసన చేస్తున్న సభ్యులను వారి సీట్లకు తిరిగివెళ్లాలని సభ ఉపాధ్యక్షుడు హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ పదేపదే అడిగారు. కొవిడ్‌పై చర్చకు అవకాశం ఇవ్వాలని కోరారు. రాజ్యసభ నాయకుడు పీయూష్‌ చావ్లా కూడా కొవిడ్‌పై చర్చకు అనుమతించాలని కోరారు. అయినప్పటికీ ఉపాధ్యక్షుడి విజ్ఞప్తిని నిరసన చేస్తున్న సభ్యులు పట్టించుకోలేదు. వెల్‌లో నిల్చొని అరవడం అలానే కొనసాగించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే, తదితర నాయకులను చర్చను ప్రారంభించాలని కోరగా సభలో గందరగోళం తగ్గకపోవడంతో 15 నిమిషాలపాటు వాయిదావేశారు. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనగానే రాజ్యసభ అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు దేశంలో కొవిడ్‌ పరిస్థితిపై చర్చను ప్రారంభించారు.

DO YOU LIKE THIS ARTICLE?