పార్టీ ప్రసంగానికి డిడి కత్తెర

సిపిఐ నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల ప్రసంగాల రికార్డింగ్‌లో భాగంగా తమ పార్టీ అందజేసిన ప్రసంగ పాఠానికి దూరదర్శన్‌ అధికారులు ‘కత్తెర్లు’ సూచించటం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తీవ్ర నిరసన తెలియజేసింది. తన ప్రసంగాన్ని యథాతథంగా రికార్డు చేయడానికి నిరాకరించటాన్ని పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు బినయ్‌ విశ్వం ఖండించారు. ఆయ న ప్రసంగంలో ఇతర పార్టీలపై విమర్శలు, ఆరోపణలు, నమూనా ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా ఉన్నాయని వాటిని తొలగించాలని అధికారులు కోరారు. విశ్వం తమ ప్రసంగాన్ని రికార్డు చేయకుండా తిరిగివచ్చారు. ఇదే ప్రసంగాన్ని ఆకాశవాణి రికార్డు చేసింది. ప్రసంగ పాఠా న్ని ముందుగానే పంపామని, కొన్ని భాగాలు మార్చాలని డిడి అధికారులు ఆఖరు నిమిషంలో పట్టుబట్టటం తాము నిజాయితీతో నమ్ముతున్న విషయాలను ఓటర్లకు తెలియజేయకుండా ప్రతిపక్షపార్టీల నాయకులను నిరోధించేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా విశ్వం అజయ్‌భవన్‌లో మీడియాతో అన్నారు. తాను ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ఉంచిన తమ పార్టీ అభిప్రాయాల ను వెల్లడించేందుకే తానిక్కడికి వచ్చినట్లు ఆయన డిడి అధికారులకు స్పష్టం చేశారు. అందువల్ల ఎటువంటి మా ర్పులు చేయటానికి తాను సిద్ధంగా లేనని చెప్పారు. తమ ప్రసంగాన్ని ఆమోదించటానికి అధికారులు సిద్ధపడనందున, వారి అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరానని, అందుకు వారు అంగీకరించారని తెలిపారు.
వారి లిఖితపూర్వక సమాధానం ప్రకారం, ప్రసంగ పాఠాల పరిశీలన కమిటీ సిపిఐ ప్రసంగం లో అభ్యంతరం చెప్పిన పేరాగ్రాఫ్‌ ఇలా ఉంది: ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రబోధిస్తున్న జాతి ఆధిక్యత భావజాలంతో పనిచేస్తున్న ఎన్‌డిఎ ప్రభుత్వం దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలను చిత్రహింసలు పెట్టింది, అణచివేసింది. వారు ఆ భావజాలాన్ని ముస్సోలినీ, హిట్లర్‌ తాత్వికత నుంచి అరువు తెచ్చుకున్నారు. ఈ సిద్ధాంతం ఎల్లప్పుడూ సంపన్నుల, కులతత్వ, మతోన్మాద శక్తుల ప్రయోజనాల కొరకు పనిచేస్తున్నది. ఇవే శక్తులు మరోమారు అధికారం స్వాధీనం చేసుకుంటే అది భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి చరమగీతం అవుతుంది.

DO YOU LIKE THIS ARTICLE?