పరిస్థితి అదుపుతప్పితే..

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఇప్పటివరకు తెలంగాణలో నేరుగా కరోనా వైరస్‌ సోకలేదు. కానీ విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే ఈ వైరస్‌ ఉన్నట్లు తేలుతోంది. రానున్న రోజుల్లో రెండవ దశలో భాగంగా సెకండరీ ట్రాన్స్‌మిషన్‌ జరిగి, ఇక్కడ వారికి కూడా వైరస్‌ సోకినా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అనుకోని పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు 20వేల మందికి సరిపడే క్వారంటైన్‌ కేంద్రాలు, ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. విదేశాల నుం చి వచ్చేవారి సంఖ్యకు అనుగుణంగా వెయ్యి మందికి, 5000 మందికి, 10వేలు, 20వేల మందికి సరిసడేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్వారంటైన్‌ కేంద్రాలు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉంటాయన్నారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల డిఎంఅండ్‌హెచ్‌ఒలు, ఎస్‌పిలు, కమిషనర్లు, రెవెన్యూ సిబ్బందితో మాట్లాడినట్లు చెప్పారు. ప్రతి క్వారంటైన్‌ సెంటర్‌లో ఒక వైద్యుడు, వైద్యుడికి కావాల్సిన సిబ్బంది అందుబాటులో ఉంచుతామన్నారు. వికారాబాద్‌, దూలపల్లిలో క్వారంటైన్‌ సెంటర్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. విమానాశ్రయంలో నిత్యం స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నామని, విదేశాల నుంచి వచ్చే వారిలో లక్షణాలు ఉంటే గాంధీకి, లక్షణాలు లేని వారిని నేరుగా క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తారు. ఏ జిల్లా వ్యక్తికి ఆ జిల్లాలకు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా ప్రభావం గుర్తించకముందు రాష్ట్రానికి వచ్చిన వారిని కూడా గుర్తించి అవసరమైన చికిత్స అందించేందుకు జిల్లా కేంద్రాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇండోనేషియా పాజివ్‌ వ్యక్తి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించడంతో అక్కడ అతను ఎవరెవరినీ కలిశారో వారి వివరాలను అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వస్తున్న వారికి తప్పకుండా స్క్రీనింగ్‌ చేస్తూ వారికి ప్రభుత్వం గుర్తించిన క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సిఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని కమిటీ అన్ని జిల్లాల్లోని కలెక్టర్లు, ఎస్‌పిలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుందన్నారు. ఫీవర్‌, ఉస్మానియా, ఐపిఎం, నిమ్స్‌ ఆసుపత్రుల్లో ల్యాబ్‌ల ఏర్పాటు పూర్తి అయిందని మంత్రి వెల్లడించారు. భారత్‌లో ఎక్కడా కరోనా నేరుగా రాలేదని ఐసిఎంఆర్‌ ఒక నివేదికలో ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. ముందస్తు సేవల్లో భాగంగా వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆరు పాజిటివ్‌ కేసుల్లో ఇద్దరు విదేశియులు కాగా, నలుగురు ఇక్కడి వారేనని మంత్రి తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?