పది పరీక్షలు వాయిదా

హైకోర్టు తీర్పును అనుసరించి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన

ప్రజాపక్షం / హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయి దా పడ్డాయి. హైకోర్టు తీర్పును అనుసరించి పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జిహెచ్‌ఎంసి మినహా మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనా ర్హం. పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై త్వరలో సిఎం కెసిఆర్‌తో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో మినహా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించవచ్చని శనివారం సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే కోర్టు నేపథ్యంలో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలు, ఇతర అంశాలపై విద్యాశాఖ సుదీర్ఘంగా చర్చించింది. జిహెచ్‌ఎంసి మినహా ఇతర జిల్లాల్లో పరీక్షలు నిర్వహించినప్పటికీ వాటి ఫలితాలు విడుదల చేయడం సాధ్యం కాదని విద్యాశాఖ పేర్కొంది. జిహెచ్‌ఎంసి పరిధిలో మరోసారి పరీక్షలు నిర్వహించాలంటే సాంకేతికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని.. రాష్ట్ర వ్యాప్తం గా ఒకేసారి నిర్వహించాలి లేదా రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇంటర్‌, పాటిటెక్నిక్‌, ఐటిఐ ప్రవేశాల్లో గందరగోళం తలెత్తుతుందని విద్యాశాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. పరీక్షలు లేకుండానే గ్రేడింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. సోమవారం సిఎంతో జరిగే భేటీలో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
జిహెచ్‌ఎంసిలో పరీక్షలొద్దు : హైకోర్టు
ఇదిలా ఉండగా, జిహెచ్‌ఎంసి, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర ప్రాంతా ల్లో సోమవారం నుంచి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పరీక్షలు వాయిదా వేసిన ప్రాంతాల్లోని విద్యార్థులకు విడిగా సప్లిమెంటరీ నిర్వహించాలని, ఇలా పరీక్షలు రాసే వాళ్లను రెగ్యులర్‌ విద్యార్థులుగా వ్య వహరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు శనివారం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది. కరోనా కోరల్లో విద్యార్థులు చిక్కుకునే ప్రమాదం ఉన్నందున టెన్త్‌ పరీక్షలను వాయిదా వేయాలంటూ నగరానికి చెందిన బాలకృష్ణ, పరీక్షలనే నిర్వహించరాదని సాయిమణివరుణ్‌ వేసిన వేరువేరు పిల్స్‌పై వి చారించింది. పరీక్షలు జరిగే ప్రాంతాల్లో కరోనా కేసుల గురించి వారానికోమారు సమీక్షించి పరిస్థితులు బాగా లేకపోతే పరీక్షలు వాయిదా వేయవచ్చునని ఉత్తర్వులిచ్చింది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకోవాలంది. హైకోర్టు చేసిన రెండు ప్రతిపాదనలపై ప్రభుత్వ విధానాన్ని తెలుసుకుని చెబుతానని ఎజి బిఎస్‌ ప్రసాద్‌ చెప్పడంతో మధ్యాహ్నం విచారణ సాయంత్రానికి వాయిదా పడింది. రాష్ట్రమంతటా పరీక్షలు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఎజి చెప్పారు. ఇప్పుడు పరీక్షలు రాయలేని వాళ్లకు సప్లిమెంటరీ నిర్వహించుతామని, వాళ్లను కూడా రెగ్యులర్‌ విద్యార్థులుగా చూస్తామన్నారు. పరీక్షలు నిర్వహించకుండానే గ్రేడింగ్‌ ఇవ్వాలనే ప్రతిపాదన ఆమోదయోగ్యంగా లేదన్నారు. దీనిపై పిటిషనర్ల న్యాయవాదలు అభ్యంతరం చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయని, శుక్రవారం ఒక్కరోజే జిహెచ్‌ఎంసిలో 110 కేసులు నమోదు అయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళితే కరోనా వైరస్‌ బారినపడకుండా ఉంటారనే గ్యారెంటీ ఏముందని ప్రశ్నించారు. పంజాబ్‌, మహారాష్ట్రల్లో మాదిరిగా పరీక్షలు పెట్టకుండానే విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వాలన్నారు, ఇరుపక్షాల వాదనల తర్వాత ధర్మాసనం స్పందిస్తూ, పరీక్షల కంటే విద్యార్థుల ప్రాణాలే ముఖ్యం. నిత్యం జిహెచ్‌ఎంసిలో పోజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. రేపు ఏదైనా జరగరానిది జరిగితే.. విద్యార్థులకు కరోనా వస్తే అప్పడు చింతించి లాభం ఏమీ ఉండదు. ఎవరికి పరిహారం ఎంత ఇచ్చినా ప్రయోజనం ఉండదు. ప్రాణం పోయాక ఎన్ని పైసలు ఇస్తే ఏం మేలు జరుగుతుంది. అందుకే జిహెచ్‌ఎంసి పరిధిలోని జిల్లాల్లో టెన్త్‌ పరీక్షలను వాయిదా వేయండి. పరిస్థితులు అనుకూలంగా వచ్చిన తర్వాత లేదా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో నిర్వహించే సప్లిమెంటరీలకు వారికి అనుమతి ఇవ్వండి. ఇలా పరీక్షలకు హాజరైన వాళ్లను రెగ్యులర్‌ స్టూడెంట్స్‌గా పరిగణిస్తూ సర్టిఫికెట్లు ఇవ్వాలి అని హైకోర్టు పేర్కొంది. జిహెచ్‌ఎంసి పరిధిలోని సెంటర్స్‌లో పరీక్షలు మళ్లీ నిర్వహించడం కంటే రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేయడమే ఉత్తమని ఎజి చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌ విచారణకు హాజరైన ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాతే ఈ విషయాన్ని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. రెండుసార్లు పేపర్లు రెడీ చేయడం, రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల ఇబ్బంది కావచ్చునేమోగానీ ఆచరణ సాధ్యమేనని, కరోనా కేసులు అధికంగా ఉన్న జిహెచ్‌ఎంసి పరిధిలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాల్సివుంటుందని స్పష్టం చేసింది. విచారణకు ఎస్‌ఎస్‌సి బోర్డు డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి ఇతర అధికారులు హాజరయ్యారు. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా పడింది.

DO YOU LIKE THIS ARTICLE?