పంతంగి టోల్‌గేట్‌ వద్ద గంజాయి పట్టివేత

లారీలో మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్న డిఆర్‌ఐ అధికారులు

ప్రజాపక్షం/సిటీబ్యూరో: లారీలో భారీగా తరలిపోతున్న గంజాయి మూటల్ని డైరెక్టరేట్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డిఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ- జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీ ఎత్తున గంజాయి మూటలు పట్టుబడ్డాయి. వాటి విలువ రూ.1 కోటి 68 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఒడిశా సరిహద్దున ఉన్న సీలేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎంహెచ్‌ 13ఆర్‌ 4039 నెంబర్‌ గల లారీలో మహారాష్ట్రలోని షోలాపూర్‌కు గంజాయిని తరలిస్తున్నారు. గురువారం పంతంగి చెక్‌పోస్టు వద్ద డిఆర్‌ఐ అధికారులు లారీని తనిఖీ చేసి, లారీని అందులో తరలిస్తున్న 1,121 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను అధికారులు విచారిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?