పండక్కి వచ్చినట్టు… …సాయం చేసినట్టు!

పట్నం వాసికి పల్లె నుంచి ప్రచారాహ్వానాలు

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : పట్నంలో నివసిస్తున్న పల్లె వాసికి వారి ఊరి నుంచి పిలుపు వచ్చింది. పంచాయతీ ఎన్నికల పర్వం మొదలుకావడంతో వారి స్నేహితులు, బంధువుల నుంచి గత రెండుమూడు రోజులుగా ఊరికి రావాలని, తమ కోసం ప్రచారం చేయాలని ఫోన్లు చేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో ఉద్యోగ, వ్యాపార రీత్యా స్థిరపడ్డ పల్లె వాసుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. వీరిలో చాలా మందికి ఇప్పటికీ వారి ఊర్లలోనే ఓటుహక్కు కూడా ఉంది. దీంతో వారందరికీ ప్రచారాహ్వానాలతో పాటు ఓటు కూడా వేయాలం టూ వారికి సంబంధించిన వారి నుంచి కాల్స్‌ వస్తున్నాయి. గతంలో కంటే ఈ సారి పంచాయతీ సర్పంచ్‌ పదవికి పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. కారణం కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సర్పంచ్‌కు విశేషాధికారాలు వచ్చా యి. గ్రామాభివృద్ధికి కోసం చేపట్టాల్సిన పను లు, తీసుకోవాల్సిన చర్యల విషయంలో సర్పంచ్‌కు స్వయం నిర్ణయాధికారం కల్పించింది చట్టం. అంతే కాదు గతంలో పంచాయతీ కార్యదర్శితో జాయింట్‌ చెక్‌పవర్‌ ఉండేది. ఈ సారి పంచాయతీ కార్యదర్శి కాకుండా ఉపసర్పంచ్‌తో జాయింట్‌ చెక్‌పవర్‌ ఇచ్చారు. దీంతో ఖర్చు, నిధుల విడుదల విషయంలోనూ పల్లె ప్రతినిధితే పైచేయి. దీనికి తోడు పదేళ్ల తర్వాత రిజర్వేషన్లు మారాయి. ఎంతో కాలంగా పల్లెల్లో రాజకీయంగా ఎదగాలని కలలుగంటూ రిజర్వేషన్‌ లేక ఇబ్బందులు పడ్డ నేతలు చాలా మంది ఉన్నారు. కొందరికి వారి ఊరిలో పట్టు ఉన్నప్పటికీ రిజర్వేషన్‌ కారణంగా పోటీ చేయలేక తమకు దగ్గరి వారిని నిలబెట్టి వారికోసం పనిచేస్తున్నారు. ఇలాంటి చాలా మందికి ఈ సారి స్వయంగా నిలబడే అవకాశం దక్కింది. పైగా ఈ సారి బిసి రిజర్వేషన్లు తగ్గడంతో జనరల్‌ క్యాటగిరీకి ఎక్కువ పంచాయతీలు వచ్చాయి. దీంతో ఆయా చోట్ల ఆర్థికంగా ఎదిగిన జనరల్‌ క్యాటగిరికి చెందిన వారు సర్పంచ్‌ పదవుల కోసం పోటీకి సిద్ధమవుతున్నారు. రాకరాక అవకాశం రావడంతో సర్పంచ్‌గా ఎన్నిక కావడాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పంచాయతీలో ఓటర్ల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఒక్క ఓటు కూడా గెలుపుఓటములను శాసిస్తుంది. దీంతో ఏ ఒక్క ఓటును వదలకూడదన్న భావనలో పోటీ దారులు ఉన్నారు. అందుకే తమకు ఏమాత్రం పరిచయమున్నా సరే వారికి ఫోన్లు చేసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వారి లైన్లోకి వచ్చి కుశలు ప్రశ్నలు వేయడం మొదలుపెట్టగానే ఈ సారి పండక్కి ఎలాగైనా ఊరికి రావాలంటూ ఆహ్వానిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పలకరించని వారు, అప్పుడప్పుడు ఊరికి వెల్లినప్పటికి అంటి అంటనట్లు ఉన్నవారు కూడా ఫోన్లు చేసి ఆప్యాయంగా పలకరిస్తుంటే ఆశ్యర్యపోవడం పట్నం వాసి పనవుతోంది. తొలి ఫోన్‌ కాల్‌తో ఇలా బంధం కలుపుకుంటున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?