నేరచరిత్ర!

తొలి దశ ఎన్నికల్లో 213 మంది నేర చరితులే
పది మందిపై మర్డర్‌ కేసులు, పలువురిపై రేప్‌ కేసులు
ఎడిఆర్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ : ఎన్నికల్లో పోటీ చేసే నేరచరితుల సంఖ్య పెరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 11న జరిగే తొలి దశ ఎన్నికల్లో 17% మంది అంటే 213 మంది నేర చరితులు వున్నారు. నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ అండ్‌ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌ (ఎడిఆర్‌) తన తాజా నివేదికలో ఈ అంశాన్ని వెల్లడించింది. తొలి దశ ఎన్నికల్లో పోటీ చేస్తు న్న 1279 మంది అభ్యర్థుల్లో 1266 మంది అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లు ఆధారంగా ఈ లెఖ్క తీసినట్లు ఎడిఆర్‌ తెలిపింది. మిగిలిన 13 మంది అభ్యర్థు లు అసంపూర్ణమైన అఫిడవిట్లు దాఖలు చేసిన నేపథ్యంలో వారి నేర చరిత్రను విశ్లేషించలేకపోయామని పేర్కొంది. తొలి విడతలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్రకు సంబంధించిన వివరాల్లో ప్రధానాంశాలు ఇలా వున్నా యి. 1266 మంది అభ్యర్థుల్లో 213 మంది అంటే 17 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 146 మందిపై అంటే 12 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు నమోదై వున్నాయి. అలాగే వారిలో 12 మంది అభ్యర్థులు శిక్ష అనుభవించారు కూడా. మొత్తం క్రిమినల్‌ కేసులు ఉన్న 213 మంది అభ్యర్థుల్లో 10 మందిపై హత్య కేసులు నమోదై వున్నాయి. ఐపిసి సెక్షన్‌ 302 నమోదైన వారే వీరంతా. హత్యాయత్నం నేరానికి సంబంధించి 25 మందిపై కేసులు నమోదయ్యాయి. ఐపిసిలోని 307 సెక్షన్‌ కింద వారంతా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక నలుగురు అభ్యర్థులపై కిడ్నాప్‌ కేసులు (ఐపిసి 364ఎ, 364, 366) నమోదైవున్నాయి. అంటే డబ్బు కోసం కిడ్నాప్‌ చేయడం, పెళ్లికి ఒత్తిడి తెచ్చేందుకు మహిళలను కిడ్నాప్‌ చేయడం, హత్యకు దారితీసేలా కిడ్నాప్‌ చేయడం వంటి నేరాలు ఇందులో భాగంగా వున్నాయి. అలాగే, మహిళలకు వ్యతిరేకంగా అఘాయిత్యాలు వంటి నేరాలు 16 మంది అభ్యర్థులపై నమోదై వున్నాయి. ఇవన్నీ విచారణలో వున్నాయి. వీటిలో అత్యాచారం (ఐపిసి 376)తోపాటు 354, 498ఎ వంటి సెక్షన్లు వున్నాయి. ఇక ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల విషయానికొస్తే, మొదటి దశలో బిజెపి నుంచి 83 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 36 శాతం మంది అంటే 30 మంది అభ్యర్థులు నేరచరితులు. ఇక కాంగ్రెస్‌ నుంచి 83 మంది పోటీలో వుండగా, వారిలో 42 శాతం మంది అంటే 35 మంది అభ్యర్థులు నేరచరితులు. ఇక బిఎస్‌పి నుంచి 32 మంది బరిలో వుండగా, 25శాతం మంది అంటే 8 మంది నేరచరితులు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపి నుంచి 25 మంది పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేస్తుండా, వారిలో 40 శాతం మంది అంటే 10 మంది అభ్యర్థులు నేరచరితులు. టిడిపి నుంచి ఇద్దరు అభ్యర్థులు, టిఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురు అభ్యర్థులు నేరచరితులు. ఈ నేపథ్యంలో తొలి దశలో ఎన్నికల్లో 91 నియోజకవర్గాలకు గాను 37 నియోజకవర్గాలను రెడ్‌ అలెర్ట్‌ నియోజకవర్గాలుగా ప్రకటించారు.

DO YOU LIKE THIS ARTICLE?